బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో
రాయగడ: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేవిధంగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో అన్నారు. స్థానిక సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రసంగించారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధులు ఆయా దిశగా కృషి చేయడంతో పాటు వారి పరిధుల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా గత ఏడాది పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, రవాణ, తాగు,సాగునీరు వంటి సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా అంతా కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో డ్రాపవుట్ సంఖ్య నివారణ కోసం ప్రజాప్రతినిధులు మరింత చొరవ తీసుకుని నివారణ కోసం ప్రయత్నించాలని సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మధ్యలో బడికి వెళ్లకుండా ఆగిపొయిన విద్యార్తులను గుర్తించి తిరిగి పాఠశాలలకు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమితి విద్యాశాఖ అధికారి ఛబీలాల్ సింహ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అదే తరహా ప్రయత్నంలో ఉన్నామని వివరించారు. వేసవి సెలవుల కారణంగా విద్యార్థులకు అన్‌లైన ద్వారా పాఠాలు చెప్పే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు.
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి
పంచాయతీ పరిధిల్లో మంచినీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అలాంటి గ్రామాలను గుర్తించి తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచాలని సర్పంచులు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలాఉండగా సమితి పరిధిలో మంజూరు చేస్తున్న మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందివ్వడం లేదని దీనిపై దృష్టి సారించాలని కుంభికొట సమితి సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు హరప్రసాద్ హెప్రుక, ఏబీడీవో కాలుచరణ్ నాయక్, ఎంపీ ప్రతినిధి భూషణ్ బిడిక, ఎంఎల్‌ఏ ప్రతినిధి సత్యవాన్ మండంగి, జిల్లా పరిషత్ సభ్యురాలు పద్మవతి మండంగి పాల్గొన్నారు.


