అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం
ముగ్గురు మృతి
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణం
భువనేశ్వర్: స్థానిక లక్ష్మీసాగర్ బర్‌గడ్ కెనాల్ రోడ్ ప్రాంతం బసంత్ విల్లా అపార్ట్‌మెంట్‌లో బుధవారం వేకువ జామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు ఘటనా స్థలంలో తుది శ్వాస విడిచారు. మరో బాలిక తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ కటక్ వైద్య బోధన ఆస్పత్రిలో మృతిచెందింది. ఘటనా స్థలంలో మృతి చెందిన వారిలో ఒకరు కేర్‌టేకర్ సులభ్ బెహరా, మరొకరు సెక్యూరిటీ గార్డు బిశ్వజిత్ బెహరాగా గుర్తించారు. సెక్యురిటీ గార్డ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో చిక్కుకున్న 27 మందిని అగ్నిమాపక దళం సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో బైక్‌లు, కార్లు కాలిబూడిదయ్యాయి. పోలీసులు మృతదేహాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


