యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

● నిందితుడు అరెస్టు

● నిందితుడు అరెస్టు

రాయగడ:

ఝార్సుగుడ జిల్లా లఖన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లాలుముండ గ్రామంలో బుధవారం తెల్లవారు జాము 3 గంటల ప్రాంతంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసిన 12 గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఝార్సుగుడ జిల్లా ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి లాలుముండ గ్రామానికి చెందిన ప్రదీప్‌ కుమార్‌ భొయ్‌ (25)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన నిందితుడు అదే గ్రామానికి చెందిన నీలమణి భొయ్‌గా గుర్తించారు. బుధవారం రాత్రి ప్రదీప్‌ కుమార్‌ భొయ్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో నీలమణి భొయ్‌ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. తెల్లవారి లేచి చూసేసరికి ప్రదీప్‌ కుమార్‌ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని సోదరుడు ఉత్తమ కుమార్‌ భొయ్‌ గమనించి లఖన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అనంతరం ఎస్పీ రాఘవేంద్ర, ఎస్‌డీపీఓ, లఖన్‌పూర్‌ ఐఐసీ తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన నీలమణి భొయ్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. ఉత్తమ్‌ కుమార్‌ భొయ్‌ను హత్య చేయాలనే క్రమంలోనే వరండాలో నిద్రిస్తున్న నీలమణి భొయ్‌ను పొరపాటున ప్రదీప్‌ భొయ్‌గా భావించి హత్య చేసినట్లుగా నిందితుడు నీలమణి భొయ్‌ పోలీసుల సమక్షంలో అంగీకరించినట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం సాయంత్రం 6 గంటలకు నిందితుడుని అరెస్టు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement