జయపురం: రైతులకు వ్యవసాయ రుణాలు ఇవాల్సిన రూ.కోటి 8 లక్షల 75 వేలను స్వాహా చేసిన కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్) బ్రాంచ్ మేనేజర్‌ను కొరాపుట్ ప్రాంతీయ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. అరెస్టు చేసిన వ్యక్తి కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ జయపురం పరిధిలో గల మల్కనగిరి కేసీసీ బ్యాంక్ మేనేజర్ సుధాంశు ఖొర. ఈయన మల్కనగిరి జిల్లాలో గల 5 లేంపుల రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ రుణాల మొత్తం రూ.86 లక్షల 80 వేలు, 90 మంది రైతులకు ఇచ్చిన రుణాలు రూ. 21 లక్షల 95 వేలు కలిపి రూ.కోటి 8 లక్షల 75 వేలు స్వాహా చేసినట్లు ఆరోపణ. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ సొమ్మును బంధువులు, తెలిసిన వారి ఖాతాలకు బదిలీ చేశారనే ఆరోపణ. లేంపుల పరిచాలన కమిటీల డైరెక్టర్లు మల్కనగిరి కేసీసీ బ్యాంక్ మేనేజర్ ఖొర డబ్బు స్వాహా చేశారని జయపురంలో గల కేసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం జయపురం విజిలెన్స్ విభాగానికి అప్పగించారు. దర్యాప్తు జరిపేందుకు విజిలెన్స్ డీఎస్పీ సదానంద పాణి, అజయ పాణితోపాటు ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. దర్యాప్తు జరిపిన విజిలెన్స్ టీమ్ మల్కనగిరి కేసీసీ బ్యాంక్ మేనేజర్ సుదాంశు ఖొర.. రైతులకు చెందాల్సిన నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారించింది. టీమ్ నివేదికపై సుధాంశు ఖొరపై రెండు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జయపురం విజిలెన్స్ ఎస్పీ రవీంద్ర కుమార్ పండా తెలియజేశారు.


