కంచిలి: మండల కేంద్రం సోంపేట రైల్వేస్టేషన్‌లో రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బెంగులూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ సోంపేట రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఒడిశా రాష్ట్రం అంకుల చండిపడ గ్రామానికి చెందిన ప్రభంజన్ నాయక్ అనే ప్రయాణికుడు సోంపేటలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి హాజరవ్వడానికి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాడు. దిగేటప్పుడు తన బ్యాగు జారిపడి ఆగి ఉన్న రైలు పట్టాల కిందకు చేరింది. దీంతో ఆ బ్యాగ్ తియ్యబోయి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు.


