తింటే అనారోగ్యం! | - | Sakshi
Sakshi News home page

తింటే అనారోగ్యం!

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

తింటే అనారోగ్యం! తినాలన్న ఆరాటం..

వారం రోజుల పాటు నిల్వ ఉంచుతున్న మాంసాహార పదార్థాలు

గడువు ముగిసిన, నిల్వ ఉంచిన పదార్థాల విక్రయం

ప్రజారోగ్యంతో చెలగాటం

అధికారులు తనిఖీ సమయంలోనే వెలుగులోకి..

సాక్షి, పార్వతీపురం మన్యం:

నాలుగు రోజుల కిందట కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభాకరరెడ్డి ఆదేశాలతో ఆహార భద్రత అధికారులు గుమ్మలక్ష్మీపురంలోని పలు దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు చేశారు. గడువు దాటిన ప్రముఖ సంస్థలకు చెందిన శీతల పానీయాలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పది దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

ఇటీవల కొంతమంది యువకులు పార్వతీపురం పట్టణంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్‌ చేయగా.. అందులోని చికెన్‌ రుచిమారి, దుర్వాసన వస్తోంది. నిల్వ ఉన్నదిగా గుర్తించిన వినియోగదారులు.. హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు తొలుత బుకాయించారు. గట్టిగా అడిగేసరికి మరొకటి తెచ్చి ఇస్తామని సముదాయించారు.

గతంలో పార్వతీపురం, కురుపాం, సీతంపేట ప్రాంతాల్లో ఆహార భద్రత అధికారులు చేపట్టిన తనిఖీల్లో కాలం చెల్లిన బిస్కెట్లు, శీతల పానీయాలు, ప్యాకింగ్‌ తేదీలు స్పష్టంగా లేని ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్న ఘటనలు నమోదయ్యాయి. కొన్ని కిరాణా షాపులకు జరిమానాలు విధించారు.

ఇటీవల ఓ ఉద్యోగి పార్వతీపురం పట్టణంలోని రహదారి పక్కన విక్రయాలు సాగిస్తున్న చిన్న దుకాణానికి వెళ్లి, వండిన కోడిగుడ్ల కూరను తీసుకున్నాడు. భోజనం దగ్గర కూర్చునేసరికి.. గుడ్ల కూర రుచిలో తేడాగా ఉండటాన్ని గమనించారు. అవి ముందు రోజు వండిన గుడ్లుగా నిర్ధారించుకున్నారు.

ప్రముఖ సంస్థకు చెందిన వాటర్‌ బాటిల్‌ అని దుకాణంలో కొనుగోలు చేస్తాం.. తీరా తాగక, రుచి వేరేగా ఉంటుంది! శీతల పానీయం తాగుదామంటే.. తాగాక, కడుపులో తేడా కొడుతుంది. అసలేదో, నకిలీ ఏదో కనిపెట్టలేని పరిస్థితి. వస్తువుల మీద గడువు తేదీలు కూడా స్పష్టంగా కనిపించవు. జిల్లాలో హోటళ్లు, దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు, పానీయాల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలు వ్యాపార సంస్థల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయం, పరిశుభ్రత లోపాలు వెలుగులోకి రావడం ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల గుమ్మలక్ష్మీపురం మండలంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా గడువు ముగిసిన ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కిరాణా దుకాణాలు, చిన్న ఫుడ్‌ స్టోర్లలో బిస్కెట్లు, కూల్‌ డ్రింక్స్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ గడువు ముగిసినా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సంబంధిత వ్యాపారులకు నోటీసులు జారీ చేసి, కొంతమందిపై జరిమానాలు విధించారు. ఇందులో ప్రముఖ సంస్థలకు చెందిన శీతల పానీయాలు కూడా ఉండడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలో ఈ తరహా మోసాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

తనిఖీల సమయంలోనే వెలుగులోకి..

చిన్న వ్యాపారులకు అవగాహన లోపం, ఖర్చు తగ్గించుకోవాలనే ప్రయత్నం, నిల్వ సదుపాయాల కొరత వల్ల ఆహార పదార్థాల విషయంలో తప్పు చేస్తున్నారు. పెద్ద రెస్టారెంట్లలో మిగిలిపోయిన పదార్థాలను పారబోయకుండా, కక్కుర్తితో ఫ్రిజ్‌లో దాచి, విక్రయించి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారుల దాడుల సమయంలో మాత్రమే బయటపడుతున్నాయి. ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

– జిల్లా ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. గడువు తేదీలు, నిల్వ పరిస్థితులు పరిశీలించి మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. తినుబండారాలు, శీతలపానీయాలపై గడవుతేదీ పరిశీలించాలని, తేడా ఉంటే ఫిర్యాదు చేయాలని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కోరుతున్నారు.

జిల్లాలోని కొన్ని హోటళ్లలో పరిశుభ్రత లోపాలు కూడా బయట పడుతున్నాయి. వంటకు పాత నూనె వినియోగం, నిల్వలో నిర్లక్ష్యం, పాడైపోయిన కూరగాయల వినియోగం వంటి అంశాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. వేసవి కాలంలో నిల్వ సదుపాయాల లోపం కారణంగా ఆహార పదార్థాలు త్వరగా పాడైపోయే పరిస్థితి నెలకొంటోంది. ప్రధాన రెస్టారెంట్లలో సైతం వారం రోజులపాటు నిల్వ ఉంచుతున్న చికెన్‌, గుడ్లు వంటివి వేడి చేసి విక్రయించే పరిస్థితులు ఉన్నాయి. కృత్రిమ రంగులు వాడుతున్నారు.

వీధి ఆహార విక్రేతల విషయంలోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. హైజీన్‌ ప్రమాణాలు పాటించకపోవడం, కలుషిత నీటి వినియోగం వంటి కారణాలతో ఫుడ్‌ పాయిజనింగ్‌ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోడ్డు పక్కన ఉన్న ఫుడ్‌ స్టాళ్లలో చేతులు కడగకుండా వంట చేయడం, కలుషిత నీరు వాడటం, కప్పులు/ప్లేట్లు సరిగా శుభ్రం చేయకపోవడం వంటి సమస్యలు తరచూ వెలుగు చూస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement