బోరు కప్పేసి..షాపులు కట్టేసి..! | - | Sakshi
Sakshi News home page

బోరు కప్పేసి..షాపులు కట్టేసి..!

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

పైడి భీమవరం పంచాయతీలో యథేచ్ఛగా ఆక్రమణలు

పక్కా షాపులు నిర్మించిన కబ్జాదారుడు

రణస్థలం : పైడిభీమవరం పంచాయతీలో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన ఈ రెండేళ్లలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. తాజాగా పైడిభీమవరం పంచాయతీలోని కాజా వీధిలో నారువ వైపు వెళ్లే రహదారి పక్కన సర్వే నంబర్‌ 91–1లో ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి అడ్డగోలుగా ఆక్రమించేశాడు. అందులో ప్రభుత్వానికి చెందిన చేతిపంపు(బోరు) ఉంటే అది కూడా కప్పేసి స్థలం చదును చేసేశాడు. దీనికి తోడు పక్కనే ఉన్న కాలువపైన పలకలు వేసి చదును చేసి కబ్జా చేశాడు. తదుపరి దర్జాగా పక్కా షాపుల నిర్మాణ పనులు ప్రారంభించి 90 శాతం పూర్తి చేశాడు. ఇంత జరుగుతున్నా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై గ్రామ రెవెన్యూ అధికారి జగదీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పి.అజయ్‌బాబు వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ స్థలంలో బోరు కప్పేసి అక్రమ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి పనులు నిలిపివేయమని చెప్పామని, ఇంకా ఆపకుండా నిర్మిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement