● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: మన బడి–నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ బడులపై విశ్వాసం పెంచుకుంటున్నారని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. సర్కారు బడులు బలోపేతం అయ్యాయనేందుకు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరడమే నిదర్శనమన్నారు. పార్వతీపురం డీవీఎం ప్రభుత్వ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఓ ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థికి స్వయంగా అడ్మిషన్ ఫారం అందజేసి పాఠశాలలో ప్రవేశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్ల పైబడిన పిల్లలు 10,780 మంది ఉండగా.. 5,929 మందిని ప్రభుత్వ బడుల్లో చేర్పించడమే లక్ష్యం చేసుకున్నామన్నారు. ఇంత వరకు 2,810 మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు కోలాటం, డ్యాన్సు, క్రీడలు నేర్పించడం జరుగుతుందన్నారు. సర్కారు బడులు బలోపేతం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


