పర్లాకిమిడి: గజపతి జిల్లా ఎస్పీ(ఇన్‌చార్జి)గా అదనపు ఎస్పీ సునీల్ కాంత మహంతి శనివారం రాణిపేట డీపీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బరంపురం ఎస్పీ డాక్టర్ శరవణ వివేక్‌ను పశ్చిమబెంగాల్ ఎన్నికల అబ్జర్వర్‌గా విధులకు నియమించిన దృష్ట్యా అదనపు ఎస్పీ సునీల్‌కాంత మహంతి గజపతి ఎస్పీగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలను స్వీకరించారు.
కొండచిలువ హల్‌చల్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని పాత్రోగూఢ గ్రామం వద్ద గల కెనాల్ సమీపంలో శనివారం రాత్రి భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. దీన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. అయితే ఈ కెనాల్ వద్ద స్నానాల కోసం, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి, వృద్ధులు సాయంకాల సమయంలో గాలి కోసం కూర్చుతుంటారు. సుమారు 15 అడుగుల కొండ చిలువ దర్శనం ఇవ్వడంతో వీరంతా ఆందోళన చెందారు.
విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి పోలీసు స్టేషన్ పరిధిలో నువాగడ సమితి రుబుడుసింగి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటు గోడకూలి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆదివారం విశ్రాంత మాజీ కార్యదర్శి, మాజీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిజయ కుమార్ పట్నాయిక్ ఘటన జరిగిన పాఠశాలకు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మజ్జిగ వితరణ
రాయగడ: పవిత్ర అక్షయ తృతీయను పురస్కరించుకుని స్థానిక మెయిన్ మార్కెట్‌లో యూ ట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు ఆదివారం మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛానల్ అధినేత ఇప్పిలి రమేష్ కుమార్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయగడ కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు, జ్యూవలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కింతలి అమర్‌నాథ్ హాజరయ్యారు. మండుతున్న ఎండల కారణంగా వచ్చిపోయే బాటసారులకు ఉపశమనం కలిగించేలా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమని అమర్‌నాథ్ అన్నారు.


