రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిఖాల్ పంచాయతీ నియమగిరి పర్వత ప్రాంతమైన సనొడెంగుడి గ్రామానికి చెందిన సోని సికక 12 ఏళ్ల క్రితం తప్పిపోయింది. సొమవారం నాడు పోలీసులు కేరళ రాష్ట్రంలో ఉన్న సోనిని పట్టుకుని తిరిగి వారి కుటుంబీకులకు అప్పగించారు. ఈ విషయమై మునిగుడ పోలీస్ స్టేషన్ ఐఐసీ కేశవ్ షడంగి పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నియమగిరి పర్వత ప్రాంతమైన సనొడెంగుడి గ్రామంలొ నివసిస్తున్న కంధారి సికకకు ఇద్దరు కూతుళ్లు. ఇందులొ సోని సికక చిన్నది. మానసికంగా దివ్యాంగురాలైన సోనిని చూసి కుటుంబీకులు ఎంతో బాధపడుతుండేవారు. 2013 వ ఏడాది తన కుటుంబీకులతో సోని మునిగుడ వచ్చింది. అనంతరం తన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన సోని కేరళ వెళ్లే ఒక ట్రైన్‌ను ఎక్కింది. తప్పిపోయిన తన కూతురు ఆచూకీ కొసం పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం అప్పట్లో ఫిర్యాదు చేయడంతో పాటు వారు కూడా అన్ని చోట్లా వెతకడం ప్రారంభించారు. ఇదిలాఉండగా కేరళలో గల ప్రభుత్వ మానసిక దివ్యాంగుల ఆస్పత్రి నుంచి మునిగుడ పోలీసులకు సమాచారం అందింది. కొంత కాలంగా తమ ఆస్పత్రిలో సోని చికిత్స పొందుతున్నట్లు వారు మునిగుడ పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది రోజుల క్రితం ఆమె మానసికంగా కోలుకోవడంతో తాను ఉంటున్న వివరాలను చెప్పింది. దీంతో స్పందించిన హస్పటల్ వర్గాలు ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు చొరవ తీసుకుని అక్కడి వారితో సంప్రదింపులు చేసి ఎలాగోలా సొనీని తిరిగి మునిగుడ పోలీస్ స్టేషన్ కు చేరేవిధంగా కృషి చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సోనీ ఈ విషయాన్ని ఆమె కుటుంబీకులకు సమాచారం అందించడంతో ఎంతో ఆనందించిన సోనీ కుటుంబీకులు మునిగుడ పోలీస్ స్టేషన్‌కు సొమవారం చేరుకుని 12 ఏళ్ల కిందట తప్పిపోయిన తమ కూతురిని చూసి ఆనందంతో పరవశించి పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసి తమ గ్రామానికి చేరుకున్నారు.


