భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌పీజీ, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో, గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహా పాత్రో సంయుక్త అధ్యక్షతన గురువారం లోక్ సేవా భవన్‌లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్, ప్రధాన చమురు, గ్యాస్ సంస్థల సీనియర్ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వైపు పరివర్తనను వేగవంతం చేసి వినియోగదారులను రక్షణకు కఠినమైన డిజిటల్ భద్రతా చర్యలను అమలు చేయడంపై దృష్టి సారించే దిశలో ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆహార సరఫరా శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో బ్లాక్ మార్కెటింగ్, సరఫరా గొలుసులోని అవకతవకలపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పారదర్శకత నిర్ధారణకు వేలిముద్ర, ఐరిస్ స్కాన్ ఉపయోగించి బయో మెట్రిక్ ప్రామాణీకరణ తప్పనిసరి చేసి వినియోగదారులకు డెలివరీ చేయాలని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. పీఎన్‌జీ కనెక్షన్ అందడంతో సంబంధిత వినియోగదారుని ప్రస్తుత ఎల్‌పీజీ కనెక్షన్‌ను తప్పనిసరిగా నిలిపివేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ మౌలిక సదుపాయాల మార్పును సులభతరం చేయడానికి నిరాటంకంగా పైప్‌లైన్ల వేగవంతమైన కార్యాచరణకు గ్యాస్ కంపెనీలకు పూర్తి పరిపాలనా మద్దతును అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. పట్టణ ప్రాంతాల్లో అధిక ఎల్‌పీజీ వాడకం నివారించాల్సిన ఆవశ్యకతను పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహా పాత్రో వివరించారు. అన్ని ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తక్షణమే పీఎన్‌జీ కనెక్షన్లను స్వీకరించాలని ఆయన కోరారు. ఇలాంటి మార్పులకు గృహ, పట్టణ అభివృద్ధి శాఖ వేగవంతమైన అనుమతులు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఏడాది జరగనున్న రథ యాత్ర ఉత్సవం సందర్భంగా పెరగనున్న వంట గ్యాసు డిమాండ్‌ను తీర్చడానికి పూరీలో పీఎన్‌జీ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులను ప్రత్యేకంగా ఆదేశించారు.
పారదర్శక పంపిణీ
వినియోగదారులకు తప్పుడు డెలివరీ నోటిఫికేషనులు (ఘోస్ట్ డెలివరీ) సమస్య నివారణకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) వ్యవస్థను 100 శాతం అమలు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ సింగ్ గ్యాసు పంపిణీ సంస్థలకు ఆదేశించారు. గ్యాస్ లభ్యత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాత్రింబవళ్లు 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 5 రోజుల సుస్థిర బఫర్ స్టాక్ (నిల్వ)ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రియల్ టైమ్ ఇన్వెంటరీ డేటాను ప్రతి రోజూ సంబంధిత విభాగానికి అందిస్తున్నట్లు సమావేశానికి హాజరైన కంపెనీ అధికారులు ధ్రువీకరించారు. నిరంతరాయ గ్యాస్ సరఫరాను పొందేందుకు పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆహార్ కేంద్రాలు, ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించినట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో పైపుల గ్యాస్ సరఫరా పీఎన్‌జీ నెట్‌వర్క్‌కు గత ఏడాది 342,300 కుటుంబాలను జోడించగా ఈ ఏడాది మార్చి నెలలో 580,000 కొత్త కుటుంబాలను జోడించారు. ప్రపంచంలో ఎల్‌పీజీ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారత దేశం రెండో స్థానంలో ఉంది. దేశం అవసరాలలో సుమారు 60 శాతం విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది. గత ఏడాది భారత దేశం దాదాపు 12 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి మధ్యప్రాచ్యం నుండి 22 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ దిగుమతి చేసుకుంది. పశ్చిమ ఆసియాలో తీవ్రం అవుతున్న ఘర్షణల మధ్య వాణిజ్య ఎల్‌పీజీ ధరలు రూ.195.5 మేర పెరిగాయి. ఈ నేపథ్యంలో గ్యాసు సంబంధిత అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం కావడం విశేషం.


