‘ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి’

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

జయపురం: ప్రభుత్వ భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలని కొరాపుట్‌ జిల్లా కమ్యూనిస్టు పార్టీ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రముఖ కార్మిక నేత ప్రమోద్‌ కుమార్‌ మహంతి నేతృత్వంలో గురువారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జయపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాది మంది పార్టీ శ్రేణులు జయపురం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని డిమాండ్లను వినిపించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ను కలిసి రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్‌ పూజారికి రాసిన వినతి పత్రాన్ని అందజేశారు. కొరాపుట్‌ జిల్లా బహుళ ఆదివాసీ జిల్లా అని ఈ జిల్లా ఆదివాసీలకు న్యాయ చట్టాలపై సరైన అవగాహన లేదని తెలిపారు. ఆదివాసీల కోసం నిర్దేశించిన ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌ తహసీల్దార్‌ వాటిని అమలు చేయటం లేదని ఆరోపించారు. గతంలో ఈ విషయమై పలుమార్లు ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్లకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మరోసారి జయపురం సబ్‌డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌ ద్వారా విన్నవిస్తున్నామని పేర్కొన్నారు. కొట్‌పాడ్‌ ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని భూములు లేని నిరుపేదలకు పంచాలని, ప్రజల ఆక్రమణలో ఉన్న భూములను సర్వే జరిపి ఆక్రమణ దారుల నుంచి స్వాధీన పరచుకోవాలని ఆ భూములను గ్రామ పంచాయతీలలో నివసిస్తున్న నిరుపేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బతాసన ప్రాంతంలో రైతుల నుంచి క్వింటా ధాన్యంలో 25 కిలోల ధాన్యం కోత కోస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ సమస్యలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సబ్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన వారిలో ప్రమోద్‌ కుమార్‌ మహంతితో పాటు జొడేశ్వర సామంత, జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రామ కృష్ణ దాస్‌, మాజీ కార్యదర్శి జుధిష్టర్‌ రౌళో, కునుమ్‌నాథ్‌ భొత్ర, పూర్ణ సౌర, గోవర్ధన హరిజన్‌ వందలాది మంది గ్రామీణ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement