జయపురం: జయపురం సమితి పరిధి జయంతగిరి గ్రామంలో గురువారం గ్రామ వైద్యులు, దిశారీలు(ఆదివాసీ వైద్యుల)సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో పలు గ్రామ ప్రాంతాల నుంచి మహిళ, పురుష గ్రామ వైద్యులు, దిశారీలు పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా ఆయుర్వేద వికాశ పరిషత్ ద్వారా నిర్వహించిన ఈ సమ్మేళనంలో ఆయుర్వేద వైద్య ప్రాధాన్యతపై సభికులకు వివరించారు. ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో మూఢ వైద్యాలు, దిశారీ వైద్యాల స్థానంలో ఆయుర్వేద వైద్య చికిత్స ప్రచారంపై సభికులను చైతన్య పరచారు. గ్రామ వైద్యులు దిశారీ(ఆదివాసీ వైద్యులు)ల సమ్మేళనంలో ఆయుర్వేద వైద్యాన్ని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి గ్రామీణ నాటు వైద్యులు దిశారీలు ఆయుర్వేద వైద్యంపై ప్రజలను అవగాహన కలిగించాలని సమ్మేళనంలో పాల్గొన్న వారికి ఉద్బోధించారు. ఆయుర్వేద వికాశ పరిషత్ జిల్లా కార్యదర్శి పరమేశ్వర చౌదురి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ కార్మిక నేత బాలా రాయ్ మాట్లాడుతూ నాటు వైద్యం(గ్రామీణ వైద్యం) దిశారీ వైద్యాల వలన కలిగే అనర్థాలను వివరించారు. గ్రామీణ వైద్యులు, దిశారీలు ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకొని ప్రజలకు ఆయుర్వేద వైద్య చికిత్స అందజేయాలని హితవు పలికారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని వెల్లడించారు. గ్రామ వైద్యులు, దిశారీలు డాక్టర్ల కన్నా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలరని ఆశాభావం వ్యక్త చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రాజేంద్ర కుమార్ గౌఢ, శివ కేశవ దాస్, రాజేష్ కుమార్ గౌఢ, కాళీ చరణమహరాణ, సత్య నారాయణ సాహు తదితరులు పాల్గొన్నారు. సమ్మేళనంలో గ్రామీణ వైద్యులు, దిశారీలతో జయపురం సమితి స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ అద్యక్షునిగా రఘునాథ్ అమనాత్య, ఉపాధ్యక్షునిగా రామనాథ్ పూజారి, కార్యదర్శిగా బలదేవ్ గదబ, కార్యనిర్వాహక కార్యదర్శిగా విశ్వనాథ్ కుంభార్, కోశాది పతిగా గోబర్ధన గదబ,సహాయ కార్యదర్శిగా కును గౌఢ, కార్యవర్గ సభ్యులుగా సూర్య భొత్ర, సదాశివ అమనాత్యలను నియమించారు.


