భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. పకడ్బందీగా యాత్ర సన్నాహాలు చేస్తున్నారు. పలు విభాగాలు, శాఖల ఆధ్వర్యంలో వివిధ వర్గాలకు కేటాయించిన పనులను నిర్ధారిత సమయం కంటే ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ సంబంధిత శాఖల ప్రముఖులకు ఆదేశించారు. ఆమె అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చివరి నిమిషంలో హడావిడిని నివారించేందుకు యాత్రకు 2 నెలల ముందే అప్పగించిన పనులను అన్ని వర్గాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రహదారుల విస్తరణ
ఈ ఏడాది రథ యాత్రలో జన సందోహ నియంత్రణ కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. యాత్ర జరిగే బొడొ దండొ, అనుసంధాన మార్గాలు రద్దీతో కిక్కిరిసిపోతాయి. ఈ పరిస్థితి నివారణకు ఆయా మార్గాల్లో రోడ్లు విస్తరించాలని ఆదేశించారు. రథాల సులభ ప్రయాణం, మెరుగైన జన సమూహ నిర్వహణకు వీలుగా బొడొ దండొకు అనుసంధానంగా ఉన్న అన్ని రహదారులను విస్తరిస్తామని న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ తెలిపారు.
భద్రతా ఏర్పాట్లు పటిష్టం
శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి బొడొ దండొ పొడవునా తాత్కాలిక సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పూర్తవుతుంది. మే నెల రెండో వారం సరికి ఉత్తర కూడలి నుంచి పూరీ వరకు సీసీ కెమెరాలు పని చేయడం ప్రారంభిస్తాయి. ఈ సమగ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో ఏర్పాటు అవుతుంది.
మెరుగైన ప్రజా సౌకర్యాలు
యాత్రికులు, పర్యాటకుల సౌకర్యాల పరంగా గత ఏడాది 594కి పరిమితమైన తాత్కాలిక మరుగు దొడ్ల సంఖ్యను ఈ ఏడాది 1,000 యూనిట్లకు పెంచనున్నారు. పూరీ నగరం అంతటా పడకల ఆసుపత్రులు, మానవ వనరుల మద్దతు, తక్షణ సహాయ కేంద్రాలను బలోపేతం చేయనున్నారు.
పోలీస్ సహాయక్ యాప్
పర్యాటకులకు సహాయం కోసం స్థానిక పోలీసులు పూరీ పోలీస్ సహాయక్ అనే వాట్సాప్ చాట్‌బాట్ సేవ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్శకులు +91 8763199400 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. తదనంతరం స్టేటస్ అప్‌డేట్‌ల తనిఖీ, వాహనాలు నిలిపే ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లను ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు. వినియోగదారుల అనుభవం, అభిప్రాయాలను పంచుకునే వీలు కల్పించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల గురించి తెలియజేయవచ్చు.
యాత్ర సామగ్రి ముందస్తుగా సిద్ధం
పవిత్ర రథ యాత్ర అత్యంత బృహత్తర ఘట్టం. ఏటా జరిగే యాత్రని అత్యంత పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రథాల అలంకరణకు అవసరమైన నిర్ధారిత రంగుల వస్త్రాలు, దేవతా మూర్తుల కోసం ప్రత్యేక పట్టు వస్త్రాలు, సాంబ్రాణి, చందనం తదితర యాత్ర సంబంధిత సంప్రదాయ సరంజామా ఏప్రిల్ నెల మధ్య నాటికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
తమిళనాడు చందనం
చందనం కలప తమిళనాడు నుంచి వస్తుంది. రాష్ట్ర అటవీ సంస్థ ఇతర అవసరమైన కలపను సరఫరా చేస్తుంది. ప్రధానంగా రథాల తయారీ కోసం అవసరమైన ఫషీ, ధౌరా మరియు ఆసన్ కలపకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అటవీ ప్రాజెక్టుల కింద చెట్లను నాటాలని పీసీసీఎఫ్‌కు ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం జరిగిన తొక్కిసలాట వంటి తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని వాహనాల నిలుపు ప్రాంతాల సౌకర్యాల నుండి నిఘా వ్యవస్థల వరకు పనులను త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. శ్రీ జగన్నాథుని రథ యాత్రకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులకు సురక్షితమైన, సజావైన, మరింత వ్యవసీకృతమైన అనుభవాన్ని అందించేందుకు యంత్రాంగం కంకణం కట్టుకుంది. యాత్ర సంబంధిత కార్యకలాపాలు నిర్ధారిత గడువులో పూర్తి చేసి సంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలతో మేళవించి, ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన శ్రీ జగన్నాథుని రథ యాత్రలో మధురమైన ఆతిథ్యం కల్పించేందుకు యంత్రాంగం చురుకుగా కసరత్తు చేస్తుంది.


