రాయగడ: చేనేత వస్త్రాలను ప్రోత్సహించి.. చేనేత కార్మికులను ఆదుకోవాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక సాంస్కృతిక భవనంలో మన దుస్తులు –మన పరిచయం అనే కార్యక్రమం గురువారం నిర్వహించారు. చేనేత దుస్తులను ధరించడం మన సంస్కృతిలో భాగమన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులను వారంలో కనీసం రెండు రోజులైనా ధరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్కళ దినోత్సవం నుంచి ఈనెల 14వ తేదీ వరకు చేనేత వస్త్రాలపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుందని వివరించారు. జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు సంబల్‌పూర్ చేనేత దుస్తులను ధరించారు.
విషం తాగి యువతి మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి సోమనాథ్‌పూర్ పంచాయతీ సీమాగాందీ గ్రామంలో గురువారం చంపా పడాల్ (18), విషం తాగి మృతి చెందింది .పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చంపా మల్కన్‌గిరిలో కాలేజ్‌లో ఇంటర్ చదువుతోంది. బుధవారం కాలేజీ నుంచి వచ్చి రాత్రి భోజనాలు అయ్యాక అంతా పడుకున్న తర్వాత పొలం కోసం తెచ్చి విషం తాగింది. కాసేపటికి వాంతులు చేసుకోవడంతో తల్లి చూసి తండ్రికి చెప్పింది. వెంటనే కూడుములగూమ్మ ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్యం చేసి అనంతరం మల్కన్‌గిరి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందింది. ఈ విషయన్ని బలిమెల పోలీసు స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
భువనేశ్వర్: దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు నేపథ్యంలో ఖుర్దారోడ్ మండలం పునర్విభజన అనివార్యమైంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు 7 స్టేషన్లు తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం పరిధి నుంచి వేరు చేసి దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో జోడించారు. ఈ మేరకు రైల్వే బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో పలాస, బారువ, జాడుపూడి, సుమ్మాదేవి, సోంపేట, మందస రోడ్, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లు తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని విశాఖపట్నం మండలం ఆధీనంలోకి మార్చారు.
ఒంటి పూట బడులు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఒంటి పూట బడుల నిర్వహణకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు అయినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విభాగం ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు వేసవి సెలవులు ఆరంభం వరకు నిత్యం ఉదయం 6.30 నుంచి 10.30 వరకు పనిచేస్తాయి. వేసవి తాపం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విభాగం కార్యదర్శి ఎన్. తిరుమల నాయక్ తెలిపారు. వడదెబ్బ నివారణకు విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలో తాగునీరు అణుక్షణం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల గొట్టపు బావులు వంటి తాగు నీటి వనరుల పునరుద్ధరణకు సత్వర చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు తరచు నీరు తాగేందుకు వీలుగా నిర్ధారిత విరామంతో వాటర్ బెల్ (నీరు గంట) మోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం విశేషం. ఆరు బయట కార్యకలాపాలు నివారించడంతో పాఠశాలల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు.
మహిళా హాస్టల్‌పై బాంబు దాడి
భువనేశ్వర్: స్థానిక లక్ష్మీ సాగర్ ప్రాంతంలో మహిళా హాస్టల్‌పై గురువారం సాయంత్రం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దుండగులు బాంబులు రువ్వడంతో ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. లక్ష్మీ సాగర్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కారణం స్పష్టం కాలేదు. దుండగుల చిత్రం సీసీటీవీలో రికార్డయ్యింది.


