
కన్ను మూసిన బొలొంగా బాలిక
భువనేశ్వర్: అగ్ని మంటల్లో గాయపడి మృత్యు పోరాటం చేసిన బాలిక శని వారం రాత్రి కన్ను మూసింది. ధ్రువీకరణకు నోచుకోని సందిగ్ధ అగ్ని ప్రమాదంలో ఈ బాలిక శరీరం చాలావరకు కాలిపోయింది. గత నెల 19న పూరీ జిల్లా నిమాపడా నియోజక వర్గం పిప్పిలి మండలం బొలొంగా ఠాణా పరిధి బయాబొరొ గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటనలో 15 ఏళ్ల బాలిక ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.
అయితే బాలిక మంటల్లో ఎలా చిక్కుకుంది? ఎవరు నిప్పు అంటించారు? ఎందుకు అంటించి ఉంటారు? తదితర సందేహాల నడుమ సత్వర చికిత్స కోసం స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్స పొందుతు బాలిక తుది శ్వాస విడిచిన మరు క్షణమే దర్యాప్తు కొనసాగిస్తున్న వర్గం బాలిక మరణంలో ఎవరి ప్రమేయం లేదని ప్రకటించింది. పోలీసుల దిగ్భ్రాంతికర ప్రకటనతో రాష్ట్రంలో పరిస్థితి మరోసారి భగ్గుమంది. విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
ఢిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో ఆమె పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కమిషనర్ స్వస్థలానికి విమానంలో తరలించే ఏర్పాట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఇంటి ఆవరణలో పోలీసు భద్రత
మృత బాలిక స్వస్థలంలో ఇంటి ఆవరణలో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరో వైపు గ్రామస్తులు బాలిక అంత్యక్రియల కోసం స్మశాన వాటికలో అనుబంధ ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. గ్రామం పూర్తిగా నిశ్శబ్దమైంది. ఎవరూ బయటకు రావడం లేదని పోలీసు వర్గాల సమాచారం.
చివరి దశలో దర్యాప్తు: పోలీసులు
బొలొంగా ఘటనలో బాలిక మృతిపై రాష్ట్ర పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు ప్రకారం, ఈ ఘటనలో మరెవరి ప్రమేయం లేదని స్పష్టమవుతోందని ప్రకటించారు. బాలిక మరణ వార్తతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రసారం చేసింది.
తుంగలో తొక్కేందుకు కుట్ర: కాంగ్రెస్
బాలిక మరణ వార్త ప్రసారం కావడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒడిశా పోలీసులు, బాలిక తండ్రి వ్యక్తీకరించిన అభిప్రాయాలు మూస పోసినట్లు ఉండడం సంచలనాత్మక సంఘటనని తుంగలో తొక్కే ప్రయత్నంగా తారసపడుతుందని కాంగ్రెస్ నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆదివారం ఆమె మాట్లాడారు. ఈ విచారకర సంఘటన జరిగి 384 గంటలు గడిచాయని, దోషి ఎవరో ఇంత వరకు గుర్తించ లేదన్నారు. ప్రభుత్వం ఈ కేసును అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని సోనాలి సాహు బాహాటంగా ఆరోపించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులను 7 రోజుల్లోగా డీజీపీ అరెస్టు చేయకపోతే, డీజీపీ కార్యాలయాన్ని చుట్టుముడతామని కాంగ్రెస్ హెచ్చరించింది.
నిప్పు మంటలతో గాయపడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత బాలిక వాంగ్మూలం పలుమార్లు నమోదు చేశారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ప్రత్యక్షంగా సందర్శించి బాలిక క్రమంగా కోలుకుంటుందని ప్రకటించారు. ఇంతలో బాలిక కన్ను మూసిందనే వార్త ప్రసారం కావడం దురదృష్టకరం. ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కిరసనాయిలు పోసి బాలికకు నిప్పు అంటించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందం అకస్మాతుగా ఈ సంఘటనతో ఎవరి ప్రమేయం లేదని ప్రకటించడం పకడ్బందీ వ్యూహాత్మక హత్యా సంఘటనగా ప్రేరేపిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి సోనాలి సాహు ఆరోపించారు.
ఎవరి ప్రమేయం లేదు: పోలీసులు
భగ్గుమన్న విపక్షాలు
దర్యాప్తు ముగియకుండా తీర్మానం సందిగ్ధం: డాక్టర్ సస్మిత్ పాత్రో
పూరీ జిల్లాలో నిప్పు మంటల్లో చిక్కుకున్న బాధిత బాలిక మరణించడం విషాదకరం. ఈ విచారకర సంఘటన పురస్కరించుకుని స్థానిక పోలీసు ఠాణాలో దాఖలు అయిన ఎఫ్‌ఐఆర్‌లో ముగ్గురు దుండగుల పేర్లు నమోదయ్యాయి. పోలీసుల ఈ ప్రకటన రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి సందేశాన్ని అందిస్తుందని రాజ్య సభ సభ్యుడు, బిజూ జనతా దళ్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సస్మిత్ పాత్రో మండిపడ్డారు.
దయచేసి రాజకీయం చేయొద్దు: తండ్రి
తన బిడ్డ దురదృష్టకర మరణానికి మేము ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. దయచేసి రాజకీయం చేయొద్దని మృత బాలిక తండ్రి అభ్యర్థించాడు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారని, తాము ఎవరినీ బాధ్యులుగా భావించడం లేదని తెలిపారు.

కన్ను మూసిన బొలొంగా బాలిక

కన్ను మూసిన బొలొంగా బాలిక

కన్ను మూసిన బొలొంగా బాలిక