
సమాజ చైతన్యంలో మీడియాది గురుతర బాధ్యత
జయపురం: సమాజాన్ని చైతన్యపరచటంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల భూమిక గురుతరమైనదని జయపురం ఎం.ఎల్.ఎ తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. ఆదివారం స్థానిక హోటల్ సభాగృహంలో జరిగిన ఒడిశా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బాహిణీపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం నాల్గో స్తంభం అని, నాలుగు స్తంభాలలో ఏ ఒక్క స్తంభం లేక పోయినా ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించలేదన్నారు. మన సమాజంలో జర్నలిస్టులకు తగిన గుర్తింపు లేదని, ముఖ్యంగా పాలకులు వారికి ఎటువంటి సౌకర్యాలు, రక్షణ కల్పించటం లేదన్నారు. జర్నలిస్టులపై సంఘ వ్యతిరేకులు దాడులు జరుపుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు పెన్షన్ కల్పించాలని, ఆరోగ్య బీమా పథకం వారి కుటుంబ సభ్యలందరికీ వర్తింపజేయాలని, ఎంతో కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోవటంలేదని దుయ్యబట్టారు. తాను జర్నలిస్టుల సమస్యలపై విధాన సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నానని ఆయన వెల్లడించారు. జర్నలిస్టుల డిమాండ్‌లు నేరవేరే అంతవరకు తాను ప్రభుత్వంతో పోరాడుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యజిత్ రాయ్ చౌదరి.. జర్నలిస్టుల ఇబ్బందులు, వారి డిమాండ్లపై ప్రసంగించారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో జర్నలిస్టు భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ పాలన కమిటీ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రహి, జయపురం మునిసిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, ప్రముఖ వ్యాపారి సంజయ జైన్, అసోసియేషన్ సాధారణ కార్యదర్శి నిరంజన్ బిశ్వాల్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రసాద్ మిశ్ర, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో జర్నలిస్టులకు పెన్షన్, జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరికీ బీమా పథకం, రక్షణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 140 మంది పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.