
నిరాహార దీక్ష తాత్కాలిక విరమణ
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే లోకో పైలెట్లు నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించారు. డిమాండ్ల సాధన నేపథ్యంలో ఆందోళన చేపట్టిన లోకో పైలెట్ల వర్గంతో మండల రైల్వే అధికారులు సమావేశమై డిమాండ్లపై సానుకూలంగా స్పందించనున్నట్లు హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా 2 వారాలపాటు వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఆందోళన చేపట్టిన వారిలో ముగ్గురు లోకో పైలెట్లు ఆకస్మిక అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి సత్వర చికిత్స కల్పించారు.
తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్, గార్‌ుడ్స మండలి, అఖిల భారత లోకో రన్నింగ్ సిబ్బంది సంఘం (ఏఐఎల్‌ఆర్‌స్‌ఏ) సంయుక్తంగా జూలై 31న ఉదయం 10 గంటల నుండి ఖుర్దారోడ్ లోకో షెడ్ క్రూ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా నిరవధిక శిబిరం ఏర్పాటు చేసి ఆందోళనకు దిగారు. రెండు రోజులపాటు నిరాహార దీక్ష నిరవధికంగా కొనసాగడంతో ముగ్గురు ఆందోళనకారులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితుల దృష్ట్యా స్థానిక మండల కార్మిక అధికారి ప్రమోద్ కుమార్ బెహెరా నిరసన స్థలానికి చేరి ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. పాక్షికంగా అంగీకరించినా.. కనీస హామీ మైలేజ్ (ఎంజీకే) డిమాండు పూర్తి స్థాయిలో అమలుజేస్తామని అధికారి హామీ ఇచ్చారు. ఇతర డిమాండ్లని పరిశీలించిన మేరకు సానుకూల చర్యలు చేపడతామని అభయం ఇచ్చి ఆందోళనకారులకు పండ్ల రసం అందజేసి ఆందోళనకు తెర దించారు.
నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న ముగ్గురు లోకో పైలెట్లు విశాల్ కుమార్, కమలకాంత్ సాహు, సంజయ్ కుమార్ మహరణ అస్వస్థతకు గురయ్యారు. వారందర్ని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స కల్పించారు. వైద్యుల సలహా మేరకు ఆహారం స్వీకరించేందుకు ఈ ముగ్గురు నిరాకరించారు. అధికారిక హామీతో ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడడడంతో కార్మిక నాయకులు ఆస్పత్రి సందర్శించి వీరికి పండ్ల రసం అందజేసి ఆందోళన విరమింపజేసినట్లు శ్రామిక్ కాంగ్రెసు నాయకుడు లక్ష్మీధర మహంతి తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు ఆధ్వర్యంలో తూర్పు కోస్ట్ రైల్వే పరిధిలోని మూడు మండలాల్లో లోకో క్రూ కంట్రోల్ కార్యాలయాలు ఖుర్దారోడ్, జఖ్‌పురా, తాల్చేర్, పారాదీప్, సంబల్‌పూర్, టిట్లాగడ్, విజయనగరం మరియు విశాఖపట్నం ప్రాంతాలలో నిరవధిక నిరాహార దీక్షని ఏకకాలంలో ఆరంభించారు. తేలికపాటి పొరపాటులకు కఠిన క్రమశిక్షణ చర్యల్ని నిరసనకారులు తీవ్రంగా ఖండించారు. పైలెట్లు, గార్డులకు చేయూతగా బాక్స్ బాయ్‌ల నియామకం పునరుద్ధరణ మౌలిక గుర్తింపుగా పరిగణించాలని యాజమాన్యంపై ఒత్తిడి పెంచారు. పరిమిత పని వేళలతో విశ్రాంతి కోసం సముచిత విరామ సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలం అవుతుందని ఆరోపించారు.

నిరాహార దీక్ష తాత్కాలిక విరమణ

నిరాహార దీక్ష తాత్కాలిక విరమణ