
చేతబడి చేశాడనే గోపాల్ మల్లిక్ హత్య
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మారుమూల గ్రామంలో చేతబడుల్లాంటి మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయని రచ్చగుడ గ్రామంలో జరిగిన ఘటన నిరూపిస్తోంది. మోహన బ్లాక్ రచ్చగుడ గ్రామంలో సుభాష్ మల్లిక్ భార్యను చేతబడి చేశాడన్న అనుమానంతో గోపాల్ మల్లిక్‌ను హత్య చేసి హరభంగి డ్యామ్‌లో విసిరేసిన ఘటనలో 14 మందిని అరెస్టు చేసినట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా ఆదివారం డీపీఓ కార్యాలయం(రాణిపేట)లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతి జిల్లా మోహన బ్లాక్‌కు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న రచ్చగుడ గ్రామంలో పదిహేను రోజుల కిందట సుభాష్ మల్లిక్ భార్య చనిపోయింది. అయితే ఆమెను చేతబడి చేశాడని రచ్చగుడ గ్రామవాసి గోపాల్ మల్లిక్‌పై సుభాష్ మల్లిక్, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గోపాల్ మల్లిక్ తనకు ప్రాణభయం ఉందని తెలిసి ఊరువదిలి బోడోఘోడో గ్రామానికి వెళ్లిపోయాడు. కొన్నిరోజుల తర్వాత స్వగ్రామం రచ్చగుడలో ఉన్న తన ఆవులు, మేకలను బోడోఘోడోకు తరలించి అక్కడే స్థిరపడటానికి ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే తన బావమరిదితో రచ్చగుడకు 5 కిలో మీటర్ల దూరంలో తన పశుసంపద తీసుకువస్తే అక్కడి నుంచి తోలుకు వెళతానని చెప్పడంతో ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడ మా టువేసి గోపాల్ మల్లిక్‌ను పట్టుకుని గ్రామంలో ఒక చీకటి గదిలో కట్టివేసి తీవ్రంగా కొట్టి, మర్మాంగాన్ని చితగ్గొట్టి, చేతులు కాళ్లు కట్టివేసి అడవ వద్ద హరభంగి డ్యామ్‌లో ఈ శనివారం రాత్రి పారవేశారు. ఈ సమాచారం అందుకున్న అడవ, మోహన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నుంచి పారిపోతున్న కొందరిని పట్టుకున్నారు. ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితులు ఆరుగురు, పరోక్షంగా సహాయపడిన మరో 8 మందిని మోహన పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరచుతున్నట్టు స్పీ జ్యోతింద్ర పండా తెలిపారు.
కేసులో 14 మంది నిందితుల అరెస్టు

చేతబడి చేశాడనే గోపాల్ మల్లిక్ హత్య