
ఓటీఈటీ ప్రశ్న పత్రం లీక్
● బీఎస్‌ఈ ఉపాధ్యక్షుడు నిహార్ రంజన్ మహంతి అరెస్టు
భువనేశ్వర్: ఒడిశా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఓటీఈటీ) ప్రశ్న పత్రం లీక్ కేసులో రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్‌ఈ) ఉపాధ్యక్షుడు నిహార్ రంజన్ మహంతిని క్రైమ్ శాఖ ఆది వారం అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో ఇదో కీలక పరిణామంగా దర్యాప్తు సంస్థ క్రైం శాఖ పేర్కొంది. క్రైం శాఖ దర్యాప్తులో భాగంగా నిహార్ రంజన్ మహంతిని శనివారం ప్రశ్నించిన తర్వాత ఈ అరెస్టు జరిగింది. ఈ పరిణామంతో మొత్తం అరెస్టుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. పరీక్షా బోర్డుతో కలిసి పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ప్రశ్న పత్రం లీక్ వ్యూహం పకడ్బందీగా కొనసాగిందని దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జితన్ మహరణ ఈ లీక్‌లో కీలక పాత్ర పోషించాడని క్రైమ్ శాఖ డైరెక్టరు జనరల్ బినయ్ తోష్ మిశ్రా విలేకర్లకు తెలిపారు. జతిన్ మహరణతో బీఎస్‌ఈ ఉపాధ్యక్షుడు నిహార్ రంజన్ మహంతికి సంబంధం ఉన్నట్లు విచారణలో ధ్రువీకరించారు.
2, 3 నెలల్లో వీరివురు 100 సార్లు సంభాషించినట్లు ఫోన్ ట్రాకింగ్‌లో తేలింది. అతని ల్యాప్‌టాప్ నుంచి ప్రశ్న పత్రం లీకై ంది. ఇది బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందన్నారు. ఈ నిర్లక్ష్యంతో ప్రశ్న పత్రం లీకేజీ జరిగిందని డైరెక్టరు జనరల్ వివరించారు. వరుసగా 4 సార్లు నిహార్ రంజన్ మహంతిని విచారణలో ప్రశ్నించిన మేరకు అందిన సమాచారం, ఆధారాల బలంతో అరెస్టు చేసినట్లు డైరెక్టరు జనరల్ వివరించారు. ఈ మధ్య కాలంలో జతిన్ మహరణ ఖాతాకు రూ. 2.4 లక్షలు బదిలీ అయ్యాయని క్రైమ్ శాఖ వర్గాలు నిర్ధారించాయి. లీక్ కేసులో ఇటీవల ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రశ్న పత్రం బహిర్గతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం జూలై 20న జరగాల్సిన ప్రత్యేక ఓటీఈటీ–2025 పరీక్ష రాత్రికి రాత్రి వాయిదా వేసినట్లు ప్రకటించారు.ఈ ఊహాతీత పరిణామంతో 75,000 మందికి పైగా అభ్యర్థులను దిగ్భ్రాంతి చెంది నిరాశకు గురయ్యారు. ప్రత్యేక ఒడిశా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో 193 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రాసేందుకు సమగ్రంగా 75,403 మంది ఇన్ సర్వీస్ ప్రాథమిక ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

ఓటీఈటీ ప్రశ్న పత్రం లీక్