
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం
జయపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు తొమ్మిదో తేదీన ఘనంగా నిర్వహించాలని జయపురం ఆదివాసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ విషయమై స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో ఆదివాసీ సంఘ అధ్యక్షులు జితేంద్ర నాయిక్ అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించి చర్చించారు. సమావేశంలో జయపురం సమితి, మున్సిపాలిటీ ప్రాంతాలలోని ఎనిమిది ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హాజరై చర్చచించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు సూర్యమహల్ కూడలి నుంచి పట్టణ ప్రధాన మార్గం మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు భ్యారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ర్యాలీలో కొరాపుట్ జిల్లాలోనిఅన్ని ఆదివాసీ తెగల ప్రజలు తమ సంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఏటా లాగనే ఈసారి కూడా ఉత్సవాలను అంగరంగ వైభవంగా.. ధూం ధాంగా నిర్వహించాలని నిశ్చయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సూర్యమహాల్ ప్రాంతానికి బొండా బాగ్ మందిరం వద్ద గదబ, పరజ, పెండియ, అమనాత్య, భొత్ర, కంధ, భూమియ మొదలగు సాంప్రదాయ ఆదివాసీ ప్రజలు చేరుకోవాలన్నారు. అక్కడ బొండాబాగ్‌కు పూజలు చేసి బయలు దేరే ర్యాలీలో ఆదివాసీ ప్రజలు సంప్రదాయ దుస్తులతో పాల్గొనేలా చూడాలని సమావేశం వెల్లడించింది. అలాగే వివిధ ఆదివాసీ నృత్య, వాయిద్యాలు, సంగీతాలతో పాల్గొంటాయని సమావేశంలో పాల్గొన్న సంఘ నాయకులు వెల్లడించారు. ర్యాలీ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరిన తరువాత ఆదివాసీ ప్రజల వివిధ సమస్యలపై సబ్‌కలెక్టర్ మెమోరాండం సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో జయపురం సమితి చైర్మన్ తిలోత్తమ ముదులి, అమనాత్య సమాజ్ ఉపాధ్యక్షులు ప్రఫుల్ల అమనాత్య, పెండియ సమాజ్ ఉపాధ్యక్షులు టంకుధర హల్వ, జయపురం పట్టణ పరజ సమాజ్ బాసుదేవ్ నాయిక్, రొండాపల్లి సర్పంచ్ ఆనంద హల్వ, అంత గ్రామ సర్పంచ్ బాబుల దిసారి, సౌర సమాజ్ అధ్యక్షులు దొయితారి సౌర, కార్యదర్శి చరణ సౌర, పొరజ సమాజ్ ప్రతినిధి బేణు నాయిక్, గదబ సమాజ్ ప్రతినిధి జుదిష్టర్ గదబ తదితరులు పాల్గొన్నారు.