
విషాహారం తిని మహిళ మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బేజాంగివాడ పంచాయతీ బటినీగూడలో విషాహారం తిని ఓ మహిళ మృతిచెందింది. భీమే ముసాకి(50) అనే మహిళ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. అర్ధరాత్రి వేళ ఆమె కేకలు వేయడంతో అందరూ వెళ్లి పరిశీలించారు. అప్పటికే నోటి నుంచి నురగలు రావడంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషాహారం తినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందింది. ఐఐసీ ముకుందో మేల్క దర్యాప్తు చేస్తున్నారు.
భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య విమాన సౌకర్యం
భువనేశ్వర్: రాష్ట్రంలో విమానయాన సౌకర్యాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. త్వరలో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఝార్సుగుడ ప్రాంతానికి ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యం ఆగస్టు 16 నుంచి అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బుధవారం తెలిపారు. బి–మాన్ కార్యక్రమం కింద ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెడుతన్నట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్ – ఝార్సుగూడ మధ్య వారానికి 5 రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వారం పొడవునా ఈ సేవలు కల్పించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు.