
జయపూర్ మహారాజతో గిరిజనులు భేటీ
కొరాపుట్: జయపూర్ మహారాజు విశ్వేశ్వర చంద్రచుడ్‌తో నందపూర్ గిరిజనులు భేటీ అయ్యారు. సూర్యవంశం రాజులు నందపూర్‌ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అనంతరం నారాయణ పట్న, చివరకు జయపూర్‌ను రాజధానిగా మార్చుకొని పాలన సాగించారు. నందపూర్ రాజధానిగా ఉన్నప్పుడు 1932లో 32 మెట్ల సింహాసనం నిర్మించారు. దాని పైనుంచి రాజ దర్బార్ కొనసాగింది. ఇప్పటికీ ఈ సింహాసనం ఉంది. ఆ సింహాసనంపై 32వ మహారాజు వినాయక్ దేవ్, లీలావతి దంపతుల విగ్రహాలు పెట్టాలని గిరిజనుల విజ్ఞప్తి చేశారు. దీనిపై రాజు సానుకూలంగా స్పందించి విగ్రహాల ఏర్పాటుకు నిధులు పంపిస్తానన్నారు. అప్పట్లో రాజదర్బార్ ఉన్న భవనాన్ని బ్రిటీషర్లు ట్రెజరీ, తహశీల్దార్ కార్యాలయాలుగా వినియోగించుకున్నారు. నూతన భవనంలోకి ప్రభుత్వ కార్యాలయాలు మారడంతో ఆ రాజ భవనాన్ని మ్యూజియంగా మార్చాలని గిరిజనుల విజ్ఞప్తి చేశారు. రాజును కలిసిన వారిలో నందపూర్‌కి చెందిన మున్న దళపతి తదితరులు ఉన్నారు.