
హే జగన్నాథా..!
● శ్రీమందిరానికి భద్రత లోపం ● సోషల్ మీడియాలో రత్న భాండాగారం ఫొటోలు వైరల్ ● ఫొటోలు పోస్టు చేసిన భారత పురావస్తు శాఖ ● విస్మయం వ్యక్తం చేస్తున్న భక్తజనం
భువనేశ్వర్:
ప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామివారి శ్రీమందిరం అభద్రతా వ్యవస్థ నడుమ కొట్టుమిట్టాడుతోంది. గత కొద్దికాలంగా ఈ దేవస్థానంపై ఉగ్రవాదులు కన్నువేసి ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల కాలంలో శ్రీమందిరం కనీస భద్రతని కూడా నోచుకోలేని దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నాయి. భద్రత సంబంధిత లోపాలు తలెత్తిన ప్రతిసారీ శ్రీమందిరం పాలకవర్గం, రాష్ట్ర న్యాయశాఖ ఇతర అనుబంధ బాధ్యతాయుతమైన అధికార వర్గాలు బాధ్యులైన వారికి వ్యతిరేకంగా చర్యలు చేపడతామని మీడియాలో అట్టహాసంగా ప్రకటించి, విస్తృత ప్రచారం తర్వాత అంతా సద్దుమణగడం ఆనవాయితీగా మారింది. దీంతో ఆలయం లోపలి ప్రాంగణానికి పరిమితం కావాల్సిన ఆచార వ్యవహారాలు, ఆలయ కట్టడాలు వగైరా బాహ్య ప్రపంచంలో సోషల్ మీడియా వేదికగా బట్టబయలవుతున్నాయి. ఈ చర్యలపై బాధ్యతాయుతమైన అధికార వర్గాల చర్యల నిర్వీర్యత ప్రభావంతో ఈసారి మరో పెద్ద ఘోరం తెరకెక్కింది.
సోషల్ మీడియాలో వైరల్
పూరీ జగన్నాథుడు సిరిమంతుడు. స్వామివారి ఆస్తులు, నగలు, ఆభరణాలు వగైరాకు సంబంధించి వాస్తవ లెక్కలు, జమలు దాదాపు ఎవరికీ తెలియవు. అలాగే అత్యంత అమూల్యమైన స్వామి ఆభరణాలు ఇతర సొత్తు గోప్యంగా రత్న భాండాగారంలో పదిలపరచి ఉంటుంది. ఇది నిత్యం అగణిత భక్తులు, యాత్రికులు సందర్శించే శ్రీమందిరం ప్రాంగణంలోనే నెలకొని ఉంది. అయితే ఎక్కడ ఉంది అనే విషయం ఇంతవరకు సాధారణ భక్తజనులకు తెలియదు. అంతటి గోప్యమైన రహస్య రత్న భాండాగారం ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ప్రసారానికి సాక్షాత్తు భారత పురావస్తు శాఖ ఏఎస్‌ఐ సారథ్యం వహించింది. పురాతన కట్టడాలు, ప్రాముఖ్యత, అనుబంధ విలువల పరిరక్షణలో కీలక పాత్రధారిగా వెలుగొందుతున్న ఏఎస్‌ఐ ఇటువంటి బహిర్గతానికి పాల్పడడం భక్తజన హృదయాల్ని కలచి వేస్తోంది. రాష్ట్రంలో సాధారణ ప్రజలకు కనీస భద్రత, రక్షణ కొరవడిందని గగ్గోలు ఎత్తుతున్న తరుణంలో, సాక్షాత్తు జగతినాథునికి రక్షణ, భద్రత కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలువునా విఫలమైందనే ఆరోపణలతో దద్దరిల్లుతోంది. జగన్నాథ స్వామివారి రత్న భాండాగారం లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రత్న భాండాగారం పవిత్రతను భక్తులు ఎంతో గౌరవిస్తారు. భారత పురావస్తు శాఖ శ్రీమందిరం ప్రాంగణం లోపలి ప్రాకారంలో రత్న భాండాగారం చిత్రాలను బాహ్య ప్రపంచానికి బహిరంగపరచడం ఉద్దేశపూర్వక చర్యగా కాకపోయినా, మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాల ప్రసారంపై రేగిన మనోభావాలకు ప్రతిస్పందనగా భారత పురావస్తు శాఖ చిత్రాలను తొలగించి పారదర్శకత చాటుకునే దిశలో పావులు కదుపుతోంది.
తీవ్ర విచారం
మహాప్రభు జగన్నాథునిపై భారత పురావస్తు సర్వే సంస్థ, భారత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రత్న భాండాగారం చిత్రాలను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఘోర అపచారమని విపక్ష బిజూ జనతా దళ్ నాయకుడు డాక్టర్ అమర్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సువిశాల శ్రీమందిరం ప్రాంగణంలో రత్న భాండాగారం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. మహాప్రభు ఆభరణాలు మరియు అమూల్యమైన సంపద భద్రతకు భంగం కలిగించేలా భారత పురావస్తు శాఖ భాండాగారం ఉనికిని సమగ్ర ప్రపంచానికి ప్రచారం చేసినట్లు అయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, శ్రీజగన్నాథ ఆలయ అథారిటీ (ఎస్‌జేటీఏ), పూరీ అధికార వర్గాలు ఇతరేతర సమస్త విభాగాలు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిపై అంకిత భావంతో సేవలు అందిస్తారని సమగ్ర భక్త జన వర్గం పూర్తిగా విశ్వసిస్తుంది. ఏఎస్‌ఐ దుశ్చర్యతో ఈ విశ్వాసం బీటలు వారింది. ఈ విశ్వాసాన్ని కూడగట్టుకునే ప్రయత్నంలో సాంఘిక మాధ్యమం వేదిక నుంచి రహస్యమయమైన ఫొటోలు తొలగించింది. అయితే ఇంతలోనే జరగరాని నష్టం జరిగి పోయిందని డాక్టర్ అమర్ పట్నాయక్ తన సోషల్ మీడియా ఖాతాలో వివరించారు. ఒడియా ఆత్మ గౌరవం (అస్మిత)ను రక్షించడం కోసమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, ఈ విచారకర సంఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం వెంటనే నిందితులకు వ్యతిరేకంగా ఎప్‌ఐఆర్, కేసులు నమోదు నమోదు చేస్తుందా అని నిలదీశారు. ఈ సంఘటనపై ప్రత్యక్షంగా చొరవ కల్పించుకునేందుకు పూరీ గజపతి మహారాజా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించడం అనివార్యమని హితవు పలికారు.

హే జగన్నాథా..!