
భారీగా గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్ మూడో నంబర్ ప్లాట్ ఫారంలో గంజాయితో ఒక యువకుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెన వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ రోహన్‌గా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు సోమవారం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్లాట్ ఫారం నంబర్ మూడులో అనుమానాస్పదంగా కనిపించిన ఒక యువకుడి బ్యాగు తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు.
అంగన్‌వాడీ కేంద్రానికి తాళాలు
జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి ఝడిగుడ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి స్థానికులు తాళాలు వేశారు. కేంద్రానికి అంగన్‌వాడీ కార్యకర్త సక్రమంగా రాకపోవడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని ఆగ్రహించారు. సదరు కార్యకర్త వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారని ఆరోపించారు. పౌష్టికాహారం పిల్లలకు, మహిళలకు సరఫరా చేయకుండా స్టోర్ రూంలో ఉంచుతున్నారని, దీంతో అవి పురుగులు పడుతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని ఇదివరకే ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌కు తెలియజేశామన్నారు. సీడీపీవో, సూపర్‌వైజర్లు గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరించేవరకు తాళాలు తెరవనివ్వమని స్పష్టం చేశారు. దీనిపై సీడీపీవో సబిత బ్రహ్మ స్పందించి గ్రామస్తుల ఆరోపణలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
విదేశీ మద్యం స్వాధీనం
రాయగడ: అక్రమంగా కారులో విదేశీ మద్యాన్ని తరలిస్తున్న ఒక యువకుడిని మునిగుడ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 123.480 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, రవాణాకు వినియోగించే కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. మునిగుడలో విదేశీ మద్యం జోరుగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
మూల విరాటులకు మహాస్నానం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై మూల విరాటులకు మంగళవారం మహాస్నానం చేయించడం అనివార్యం అయింది. ఆలయం లోపల ఒక సేవకుడు పడిపోయి రక్తస్రావం కావడంతో ఆలయం పవిత్రతకు భంగం వాటిళ్లినట్లు పరిగణించి ఈ చర్య చేపట్టారు. దీంతో సాధారణ భక్తుల సర్వ దర్శనం ప్రభావితం అయింది. తాత్కాలికంగా కొన్ని గంటల పాటు దర్శనం నిలిపి వేశారు. స్వామివారి ప్రాతఃకాల ధూప సేవ కోసం సువారొ బొడు సేవకుడు శ్రీమందిర గర్భగుడిలో పూలు మరియు పాత్రలను అమర్చుతుండగా జారిపడిపోయాడు. ముఖానికి గాయమై రక్తం నేలపై చిమ్మింది. పొహడొ ఉఠా మహాస్నానంగా పేర్కొనే ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా ప్రధాన దేవతలు మరియు ఆలయం స్వచ్ఛత పునరుద్ధరణకు మహాస్నానం నిర్వహించారు. ఆలయ ఆచారాల ప్రకారం ఆలయ ప్రాంగణంలో రక్తస్రావం, వాంతులు ఇతరేతర అపరిశుభ్రతకు సంబంధించిన ఏదైనా సంఘటన చోటుచేసుకుంటే ఆలయం, దేవతల పవిత్రతను పునరుద్ధరించేందుకు మహాస్నానం నిర్వహిస్తారు.

భారీగా గంజాయి స్వాధీనం

భారీగా గంజాయి స్వాధీనం