
విద్యార్థిని మృతిపై దర్యాప్తునకు ఆదేశం
రాయగడ:
సదరు సమితి కూలిలోని ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థిని దివ్య మండంగి మలేరియా వ్యాధితో మృతి చెందిన ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టిన అశుతోష్ కులకర్ణి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, మూడు రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ఈ కమిటీలో ఉన్నారు. ఈ దర్యాప్తు కమిటీ ఆశ్రమ పాఠశాలకు వెళ్లి అక్కడ వాస్తవాలను పరిశీలిస్తారు. అదేవిధంగా మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను కలిసి వారి అభిప్రాయాలను సైతం సేకరిస్తారు. కొద్దిరోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థిని దివ్య మండంగి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి నిర్వాహకులు చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బరంపురం తరలించాలని జిల్లా కేంద్రాస్పత్రి వైద్యులు చెప్పడంతో అప్పుడు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు బరంపురం తరలించగా చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థిని మృతి చెందిందని కుటుంబీకులు, గ్రామస్తులు ఆశ్రమ పాఠశాల వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

విద్యార్థిని మృతిపై దర్యాప్తునకు ఆదేశం