
కారు ఢీకొని ఇద్దరు మృతి
జయపురం: సబ్ డివిజన్ బొరిగుమ్మ పోలీసుస్టేషన్ పరిధి 26వ జాతీయ రహదారి పిండాగుడ జంక్షన్‌లో కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతి చెందిన ఇద్దరిలో ఒకరు బొరిగుమ్మకు చెందిన రోహితేశ్వర బెహర(55) కాగా, మరోవ్యక్తి పిండాగుడ గ్రామానికి చెందిన గోపాల హరిజన్(57)గా గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రోహితేశ్వర బెహర, గోపాల్ హరిజన్‌లు పిండాగుడ గ్రామం జంక్షన్ 26వ జాతీయ రహదారి పక్కన నిలుచొని మాట్లాడుతుండగా, జయపురం నుంచి బొరిగుమ్మ వైపు వేగంగా వస్తున్న ఒక ఇండికా కారు వారిని ఢీకొంది. దీంతో ఇరువురూ దూరంగా ఎగిరిపడ్డారు. సమాచారం అందిన వెంటనే బొరిగుమ్మ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఘటన స్థలంలోనే ఇరువురూ మృతి చెందారని బొరిగుమ్మ పోలీసులు వెల్లడించారు. అయితే కారు డ్రైవర్ పరారైనట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కారు డ్రైవర్‌ను త్వరలోనే పట్టుకుంటామని దర్యాప్తు అధికారి సస్మిత నాయక్ వెల్లడించారు.
బీజేడీ ఎంపీల నిరసన
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా బిజూ జనతా దళ్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా మంగళవారం నిరసన తెలిపారు. వర్షం కురుస్తున్నా గొడుగులు వేసుకుని ప్లకార్డులతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒడిశా ప్రభుత్వం నిష్క్రియాత్మకతను వీరంతా ఖండించారు. జవాబుదారీతనం, బలమైన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఒడిశా రక్త సిక్తం, గాడ నిద్రలో బీజేపీ’ ‘ఒడిశా ప్రభుత్వం మౌనం సిగ్గుచేటు’ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బాలాసోర్ నుంచి బొలంగా వరకు మహిళలపై దారుణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నలుగురిపై కేసు నమోదు
భువనేశ్వర్: బొలంగీరు జిల్లా టిట్లాగడ్ బాగ్డేర్ గ్రామంలో పసికందు అమ్మకం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. చిన్నారిని కన్న తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన దంపతులను దర్యాప్తు బృందం ప్రధానంగా ప్రశ్నిస్తోంది. ఈ ఘటనపై టిట్లాగడ్ సీడీపీవో స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బిడ్డ ను కన్న తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన దంపతుల వ్యతిరేకంగా కేసులు నమోదు చేశారు.
కాపుగోపాలపురంలో చైన్‌స్నాచింగ్
పాతపట్నం : చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా దాడులకు ఎగబడుతున్నారు. పాతపట్నం మండలం కాపు గోపాలపురంలో సోమవారం సాయంత్రం చైన్‌స్నాచింగ్ చోటుచేసుకుంది. పాతపట్నం మేజర్ పంచాయతీ కోటగుడి కాలనీకి చెందిన దంపతులు కాళ్ల జ్యోతి, నారాయణరావులు పశువులకు కుడితి పెట్టడానికి కాపుగోపాలపురంలోని నీలకంఠేశ్వర ఆలయం సమీపంలోని పశువులశాల వద్దకు బైక్‌పై వెళ్లారు. భార్యని దించేసి నారాయణరావు కాపుగోపాలపురం వచ్చేశారు. జ్యోతి పశువుల శాల వైపు కుడితి పెట్టడానికి బకెట్‌తో వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై ఇద్దరు దొంగలు వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. జ్యోతి కేకలు వేసేసరికే పర్లాకిమిడి వైపు పారిపోయారు. రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ జరిగిందని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు.

కారు ఢీకొని ఇద్దరు మృతి

కారు ఢీకొని ఇద్దరు మృతి