
అధ్యాపకులకు శిక్షణ శిబిరం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయం మానవ వనరుల వికాస కేంద్రం ఆధ్వర్యంలో దాదాపు 70 కళాశాలల అధ్యాపకులకు శిక్షణ శిబిరం మంగళవారం నిర్వహించారు. మానవ వనరుల విభాగ వికాస కేంద్రం డైరెక్టర్ చీఫ్ డాక్టర్ దేవదత్త ఇండోరియా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ విద్యా విధానం ఆధారంగా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ మిశ్ర ముఖ్య అతిథిగా పాల్గొని మానవ వనరుల వికాస విభాగ అధికారులను ప్రశంసించారు. స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో మాట్లాడుతూ.. అనేక కళాశాలల్లో అవసరమైనంత మంది అధ్యాపకులు లేకపోవడం వలన సమస్యగా ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ కార్యదర్శి మహేశ్వర చంద్ర నాయిక్, కొరాపుట్ కేంద్ర విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ రమేంద్ర కుమార్ పాడీ, రెవెన్సా వర్సిటీ విశ్రాంత అధ్యాపకులు గోరంగ చంద్రనంద తదితరులు పాల్గొన్నారు.