
రహస్య కెమెరాతో చిక్కిన యువకుడు
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దేవస్థానం భద్రత వ్యవస్థ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. శ్రీమందిరంలోనికి ప్రవేశించే ముందు తనిఖీలు నిర్వహించి స్వామి దర్శనం కోసం బారులుతీరిన భక్తులను అనుమతిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రధానంగా ఆలయ పరిమితుల పరిరక్షణలో భక్తులు, యాత్రికులు అవకతవకలకు పాల్పడకుండా నిఘా వేసేందుకు ప్రత్యేక రక్షక భటుల వ్యవస్థని శ్రీమందిరం నిర్వహిస్తోంది. మరోవైపు శ్రీమందిరం ప్రాంగణం నో ఫ్లయింగ్ జోన్, డ్రోన్ వ్యతిరేక జోన్‌గా ప్రకటించారు. ఈ బందోబస్తు ఉన్నప్పటికీ తరచూ ఏదో రకంగా శ్రీమందిరంలోని పరిమితులు అధిగమించి పలు లోపలి ప్రాంగణాల దృశ్యాల డ్రోన్ చిత్రీకరణ, వీడియో రికార్డింగు, ఫొటోలతో బాహ్య ప్రపంచం వెలుగులోకి వస్తున్నాయి.
కళ్లద్దాల చాటున రికార్డింగ్
తాజాగా మంగళవారం కంటి అద్దాల చాటున శ్రీమందిరం లోపలి దృశ్యాలను గుట్టురట్టు కాకుండా బంధిస్తున్న ప్రయత్నంలో యాత్రికుడు రహస్య కెమెరాతో పట్టుబడ్డాడు. పోలీసులు బేహరొణొ ద్వారం దగ్గర అనుమానంతో అతడిని పట్టుకున్నారు. రహస్యంగా రికార్డ్ చేయగల రే–బాన్ మెటా కళ్లజోడు ధరించిన యువకుడి కదలికపై సందేహం కలిగిన శ్రీమందిరం ప్రత్యేక రక్షక భటుల వర్గం నిలదీసింది. వీరి పరిశీలనలో యువకుడు ధరించిన కళ్లద్దాలపై రహస్య కెమెరా అమరిక ఉన్నట్లు ఖరారు అయింది. దీంతో ఆలయ లోపల చిత్రాల్ని చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. ఈ సమగ్ర వ్యవహారంపై ఆరా తీసేందుకు రక్షక భటులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పూరీ గజపతి నగరంలో ఉంటున్నట్లు సమాచారం. సింహద్వారం ఠాణా పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.