
ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ
పర్లాకిమిడి: ఒడిశాకు చెందిన విద్యార్థులకు ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీకాకుళం బొల్లినేని మెడ్‌స్కిల్స్‌తో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నామని గజపతి జిల్లా డీఎస్‌డీఈవో సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు మంగళవారం పర్లాకిమిడిలో కలెక్టరేట్ వద్ద జిల్లా స్కిల్ డవలప్‌మెంట్, ఎంప్లాయీమెంట్ శాఖ అధికారి కార్యాలయంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు పెట్టారు. ఎన్‌యూవీ ఒడిశా శిబిరంలో భాగంగా 240 మంది విద్యార్థులకు ప్రభుత్వ సహకారంతో శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు పేషెంట్ రిలేషన్ అసోసియేట్, ఎస్‌ఎస్‌సీ, ప్లస్ టూ, ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అసోసియేట్ స్టోర్ ఫార్మా కోర్సులో శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సదుపాయం, యూనిఫామ్ స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 7331118019, 7680945357, 7995013422 నంబర్లను గానీ, శ్రీకాకుళం రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గానీ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బొల్లినేని మెడ్‌స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు, గజపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.