
ఎరువుల కృత్రిమ కొరత తగదు
ఆమదాలవలస : ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు బస్తా యూరియా కోసం రోజూ గంటల తరబడి పనులు మానుకొని అధికారులు, ఆర్‌ఎస్‌కేల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు వస్తున్న ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని, టీడీపీ నాయకులు ఎరువులను తమ ఇళ్ల వద్ద దాచుకొని బయట అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆమదాలవలస నియోజకవర్గంలో సాగు చేస్తున్న 53,000 ఎకరాల సాగుకు 2850 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రభుత్వం 1600 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. పొందూరు మండలంలో 4000 ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్క జొన్న పంటకు అదనంగా 600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవేవీ పట్టకుండా విహార యాత్రలు చేస్తూ సొంత ఆదాయాలు చూసుకుంటున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, నాయకులు సాకేటి శ్రీనివాసరావు, అన్నపు కృష్ణ, ధనుజయరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.