కంచిలి: మండలంలోని కొనక గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలిక గాయత్రి దొండియా మలేరియా జ్వరంతో మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. ఈ బాలిక గ్రామ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ జ్వరం బారిన పడింది. ఈ నెల 17వ తేదీన మఠం సరియాపల్లి పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయడంతో మలేరియా జ్వరంగా తేలింది. పరిస్థితి విషమించడంతో సోంపేట సీహెచ్‌సీకి రిఫర్ చేయగా, అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు సుస్మితారెడ్డి వివరించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మృతురాలి తండ్రి బైలోడు, తల్లి తిలోత్తమలు కూలీలుగా జీవిస్తున్నారు. వీరికి మృతి చెందిన బాలికతోపాటు రెండేళ్ల కుమారుడు నితిన్ ఉన్నాడు. బాలికకు మలేరియా పాజిటివ్ రావడంతో గ్రామంలో వైద్యశిబిరాన్ని కూడా నిర్వహించారు.