
కారులో నాటుసారా రవాణా
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కంచిలి: ఒడిశా నుంచి ఆంధ్రా గ్రామాలకు విచ్చలవిడిగా నాటుసారా రవాణా అవుతోంది. ఏకంగా కార్లలోనే దర్జాగా నాటుసారాను పాలిథిన్ సంచుల్లో, చిన్నసైజు ప్యాకెట్ల రూపంలో పల్లెలకు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ రవాణాపై పటిష్ట నిఘా పెట్టారు. ఒడిశా – ఆంధ్ర అంతర్రాష్ట్ర కార్ల కదలికల మీద నిఘా ఉంచారు. ఈ నిఘాలో భాగంగా ఒడిశా సరిహద్దు గ్రామమైన కేసరపడ వద్ద ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని పరిశీలించారు. దీంతో ఆ కారులో ఆరు ప్లాస్టిక్ గోనె సంచుల్లో ఒక్కొక్కదానిలో 150 నాటుసారా ప్యాకెట్లను ప్యాక్‌చేసి, మొత్తంగా 900 నాటుసారా ప్యాకెట్లు(90 లీటర్లు) తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సారాతోపాటు కారును సీజ్‌చేసి, నాటుసారా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం మునిసిపేటకు చెందిన మొగిలి కుమార్‌ను, నాటుసారా తెప్పించిన పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన లోట్ల జోగారావును అరెస్టు చేశారు. నాటుసారా పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది మార్కారావు, భాను, అరుణ్, ఉమాపతిలను సీఐ అభినందించారు.