
జయపురం రైల్వేస్టేషన్ ముట్టడి
జయపురం: విశాఖపట్నం–కిరండూల్ ప్రయాణికుల రైలును వెంటనే కొరాపుట్–జగదల్‌పూర్‌కు పునరుద్ధరించాలని బీజేడీ శ్రేణులు డిమాండ్ చేస్తూ సోమవారం జయపురం రైల్వే స్టేషన్‌ను ముట్టడించాయి. రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో నేతృత్వంలో వందలాది మంది బీజేడీ నేతలు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పార్టీ జెండాలతో రైల్వే స్టేషన్‌ముఖ ద్వారం ముంగిట బైఠాయించారు. ఈ సంద్భంగా రైల్వే అధికారికి మెమోరాండం సమర్పించారు. గత 27 రోజులుగా కొరాపుట్ నుంచి జగదల్‌పూర్ మధ్య ప్రయాణికుల రైళ్ల రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయని, అయినా రైల్వే అధికారులు రైళ్లు నడిపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. గత నెల 2 నుంచి జగదల్‌పూర్–కొరాపుట్ మధ్య ప్రయాణికుల రైళ్లు నిలిచిపోవటం వల్ల విశాఖపట్నం, రూర్కెలా, హౌరా, భువనేశ్వర్‌లకు రైళ్ల రాక పోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వారు వెల్లడించారు. మరో పక్క గూడ్స్ రైళ్లు యథాతదంగా నడుస్తున్నాయని తెలియజేశారు. రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే జయపురం–జగదల్‌పూర్‌ల మధ్య ఒక కొత్త రైలును వేయాలని, అలాగే జగదల్‌పూర్ నుంచి సంబల్‌పూర్, అనుగోల్, కటక్, భువనేశ్వర్ మీదుగా పూరి వరకు ప్రతిదినం రైలు నడపాలని డిమాండ్ చేశారు. అలాగే జయపురం–మల్కన్‌గిరి, జయపురం– నవరంగపూర్ ల రైలు మార్గాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలన్నారు. పాసింజర్ రెళ్లు కొరాపుట్ వరకు వస్తున్నాయని, కొరాపుట్ నుంచి జగదల్‌పూర్ వరకు రైళ్లు నిలిచి పోయాయని వారు గుర్తు చేశారు. జయపురం–జగదల్‌పూర్‌ల మధ్య రైలు నడపాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.