
మృతదేహం కలకలం!
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కుడుములగుమ్మ పంచాయతీలోని ఆరోగ్య కేంద్రం వెనుక సోమవారం ఉదయం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు ఖోయిర్‌పూట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖోయిర్‌పూట్ ఐఐసీ కృష్ణచంద్ర హియల్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. అయితే చనిపోయిన వ్యక్తి తన గ్రామానికి చెందినవారు కాదని స్థానికులు తెలియజేశారు. అయితే వారం రోజులుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టు కొంతమంది చెప్పడంతో ఆ దిశగా ఆరా తీశారు. బంధువుల ఇంటికి వచ్చి ఉంటారని భావించి విచారణ చేయగా.. మల్కన్‌గిరి సమితి ఎం.వి.6 గ్రామానికి చెందిన మహదేవ్ ముర్ము (50)గా గుర్తించారు. కుడుములగుమ్మలో ఉంటున్న తన చెల్లిలు ఇంటికి ఈ నెల 20వ తేదీన వచ్చినట్టు తేలింది. ఆదివారం ఉదయం చెల్లెలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే మల్కన్‌గిరి వెళ్లిపోయి ఉంటాడనుకొని చెల్లెలు కూడా పట్టించుకోలేదు. సోమవారం ఉదయం తన అన్నయ్య శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా రోదించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఐఐసీ కృష్ణచంద్ర హియల్ చెప్పారు.