
నిండుకుండలా జలాశయాలు
జయపురం: కొరాపుట్ జిల్లాలో 15 రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు పడుతున్నాయి. దీంతో అప్పర్ కొలాబ్ జల విద్యుత్ ప్రాజెక్టు, తెలింగిరి సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శనివారం అప్పర్ కొలాబ్ ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతంలో 36 మిల్లీ మీటర్ల వర్షం పడింది. విరామం లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. శనివారం నాటికి జలాశయంలో నీరు 851.74 మీటర్లకు చేరింది. గత ఏడాది ఈ సమయానికి 851.75 మీటర్లు ఉండేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అధిక వర్షాల కారణంగా ప్రతి నిమిషానికి 168.275 క్యూసెక్కులు నీరు జలాశయంలోనికి చేరుతుండగా.. జలాశయం నుంచి బయటకు 52.4 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. ఇదిలా ఉండగా..జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలోని తెలింగిరి సాగునీటి ప్రాజెక్టు డ్యామ్ మరమ్మతులు పూర్తయిన తరువాత ఆ జలాశయంలోనికి నీరు చేరటం ప్రారంభమైంది. ఆదివారం జలాశయంలో నీటి 628.2 మీటర్ల నీటిమట్టం ఉంది. జలాశయం డ్యామ్ సగటు నీటి మట్టం 633 మీటర్లు కాగా గత ఏడాది ఇదే సమయానికి 625.1 మీటర్లు ఉండేది. కాగా ఖరీఫ్ పంటలకు రెండు ప్రాజెక్టుల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు విడిచి పడుతున్నారు.