
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
● పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు,
బంధువుల ఆరోపణ
● మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాల ఎదుట ఉంచి ఆందోళన
రాయగడ: సదరు సమితి కూలిలో గల ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న దివ్యా మండగి అనే విద్యార్థిని మృతి చెందింది. ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాల వద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చందిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కూలి ఆశ్రమ పాఠశాలలో దివ్యా మండంగికి ఈ నెల 19వ తేదీన తీవ్రమైన జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు తెలియజేయలేదు. కుమార్తె ఆరోగ్యం బాగులేదని తెలుసుకున్న విద్యార్థిని తండ్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. చికిత్స కోసం తీసుకువెళ్తానని, తనతో పంపించాలని అడిగినా అటువంటిదేమీ లేదని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పి పంపించేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జిల్లా కేంద్రా ఆస్పత్రికి శుక్రవారం పాఠశాల నిర్వాహకులు చికిత్స కోసం తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి ఆందోనకరంగా ఉందని, వెంటనే బరంపురం తరలించాలని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చి.. వెంటనే బరంపురం హస్పిటల్‌కు మెరుగైన చికిత్స కోసం ఆదివారం ఉదయం తరలించారు. బరంపురంలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. వెంటనే మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబీకులు ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి