
రాష్ట్రంలో సముద్ర రవాణా పెరుగుతోంది
భువనేశ్వర్: దేశంలోని ప్రధాన సముద్ర రవాణా కేంద్రంగా రాష్ట్రం ఆవిర్భవించనుంది. సముద్ర వాణిజ్యం, సరుకుల రవాణా గణనీయంగా పెరుగుతుండడం ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధానేతర ఓడ రేవుల సరుకు రవాణా సామర్థ్యం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 80 మిలియన్ టన్నులకు చేరుకుంది. దీనిలో ధామ్రా ఓడ రేవు వాటా అత్యధికంగా 46.08 మిలియన్ టన్నులు కాగా.. గోపాల్‌పూర్ ఓడ రేవు సామర్థ్యం 6 మిలియన్ టన్నులకు చేరుకుంది. దీనివల్ల 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.306.15 కోట్ల ఆదాయం చేకూరింది. 2024–25లో 150.41 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయడం ద్వారా పారదీప్ ఓడ రేవు దేశంలోని ప్రధాన ఓడరేవులలో అత్యధిక మొత్తంలో సరుకును రవాణా చేసిన ఘనత సాధించింది. సాంకేతికత, లోతైన బెర్త్‌లు, ఇతర ఆధునిక సౌకర్యాల ఓడరేవుగా రాష్ట్రంలో సుమద్ర మార్గ వాణిజ్యానికి కొత్త అవకాశాలు కల్పిస్తుంది. ధామ్రా, గోపాల్‌పూర్ ఓడ రేవులు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అనుసంధానంతో పురోగతి సాధిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన, ప్రధానేతర ఓడ రేవుల సామర్థ్యం క్రమంగా పెరుగుతున్నందున ఒడిశా ప్రపంచ సముద్ర వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా మారనుందని అనబంధ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తీరప్రాంత షిప్పింగ్ ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలతో అనుసంధానం మెరుగుపడుతుంది.
80 మిలియన్ టన్నుల సరుకు రవాణా