
ఆదిత్యా నమోస్తుతే!
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాస మొదటి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈవో ప్రసాద్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఉచిత మంచినీటిని పంపిణీ చేయించారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక తులసీదళాలతో ఆదిత్యుని మూలవిరాట్టును అలంకరించి భక్తుల సర్వదర్శనాలకు ఉదయం 6 గంటల నుంచే అనుమతించారు. విశిష్ట, ప్రత్యేక దర్శనాలతో పాటు ఉచిత దర్శనాల క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరారు.
ఆదిత్యుని సన్నిధిలో డ్రాట్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ది డెబ్ట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డ్రాట్–కోల్‌కత్తా) జస్టిస్ అనిల్‌కుమార్ శ్రీవాత్సవ్ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు వేదమంత్రోఛ్చారణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేదాశీర్వచనాలతో అనివెట్టి మండపంలో స్వామి వారి శేషవస్త్రాలను కప్పి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టతను, స్వామి వారికి జరుగుతున్న సేవల వివరాలను శంకరశర్మ వివరించారు.