
హిరాకుద్ జలాశయానికి వరదపోటు
భువనేశ్వర్: హిరాకుద్ జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. నీటి మట్టం నియంత్రణలో భాగంగా అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం లోనికి ప్రతి సెకన్‌కు 2.51 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుండగా సెకనుకు 2.75 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా మిగిలిన గేట్లు తెరిచే విషయం ఖరారు చేస్తారని జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గురువారం నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు విభాగం సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని నదుల నీటి మట్టం ప్రమాద సంకేతం దిగువన కొనసాగుతుందని సమాచారం.