
ప్రైవేట్ బస్సుల సేవలు అభినందనీయం
జయపురం: ప్రైవేట్ బస్సు యజమానులు కొరాపుట్ జిల్లా ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జిల్లాలో బస్సు సౌకర్యాలు అంతగాలేని గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సులు వేసి ప్రజలకు సముచిత సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జయపురంలోని ఓ కల్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన జయపురం ప్రైవేట్ బస్సు యజమానుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జయపురం ప్రైవేట్ బస్సుల యజమానులతోపాటు జయపురం మీదుగా ఇతర ప్రాంతాలకు నడిచే ప్రైవేటు బస్సు యజమానులు అనేక మంది పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల తరువాత జరిగిన ప్రైవేట్ బస్సు యజమానుల ఆత్మీయ సమావేశంలో బస్సు యజమాన సంఘ సలహాదారు బస్సు యజమాని బసంత కుమార్ బిశ్వాల్, రామ చంద్ర పాడీ, న్యాయ సలహాదారు, న్యాయవాది సుశాంత అధికారి, జయపురం బస్సు యజమానుల సంఘ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పాత్రో, కార్యదర్శి నరేంద్ర కుమార్ మహంతి, బరంపురం ప్రైవేట్ బస్సు యజమానుల ప్రతినిధి టుటుభాయి పాల్గొన్నారు. కార్యదర్శి నరేంద్ర కుమార్ మహంతి మాట్లాడుతూ.. కొరాపుట్ ప్రజలకు సముచిత బస్సు సౌకర్యాలు కల్పించటమే తమ లక్ష్యం అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తాము ప్రైవేట్ బస్టాండ్‌లో ఒక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.