
నలుగురు నిందితుల అరెస్టు
జయపురం: భారతమాల ప్రాజెక్టు క్యాంప్‌లో జరిగిన దొంగతనం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజన్‌లోని బొరిగుమ్మ పోలీసు అధికారి సత్యభ్రత లెంక శుక్రవారం వెల్లడించారు. బొరిగుమ్మ పోలీసు స్టేషన్‌లో బొరిగుమ్మ పోలీసులు నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన వివరిస్తూ.. అరెస్టు అయిన వారు బొరిగుమ్మ ప్రాంతం మీనా హరిజన్, దైతేరీ ఘాసి, త్రిపతి హరిజన్, ఒక మైనర్ ఉన్నాడన్నారు. మైనర్ నిందితుని జేజే బోర్డులో హాజరుపరచి అనంతరం అతడిని బాల రక్షక గృహానికి పంపినట్లు అధికారి వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. బొరిగుమ్మ సమితి కమర గ్రామ ప్రాంతంలో భారత మాల ప్రాజెక్టు కంపెనీలో క్యాంప్ ఉంది. కార్మికులు, సూపర్‌వైజర్‌లు ఉంటున్నారు. 2024 అక్టోబర్ 1వ తేదీ రాత్రి 3 గంటల సమయంలో నలుగురు దుండగులు క్యాంప్‌లో ప్రవేశించారని, భయంకర వాతావరణం సృస్టించి సూపర్‌వైజర్‌తోపాటు కార్మికులను తాళ్లతో బంధించారని వెల్లడించారు. వారి వద్దగల రూ.8 వేల నగదు, బైక్, మూడు ఫోన్లు, రెండు కటింగ్ మిషన్లు దొంగిలించుకుపోయారన్నారు. ఈ సంఘటనపై సూపర్‌వైజర్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్‌లో లిఖిత ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. దర్యాప్తు అధికారి ఏఎస్‌ఐ ద్రోణాచార్య బాగ్ గురువారం నలుగురు నిందితులను అరెస్టు చేశారని వెల్లడించారు. వారి నుంచి రెండు ఫోన్లు స్వాధీనపరచుకున్నట్లు ఎస్‌డీపీఓ తెలిపారు. బొరిగుమ్మ పోలీసు అధికారి పాల్గొన్నారు.
కొండచిలువ కలకలం
రాయగడ: స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం సుమారు 12 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. కార్యాలయం ముందు నుంచి కొండచిలువ వెళ్తుండగా సిబ్బంది చూసి వెంటనే స్నేక్ స్నాచర్ ప్రమోద్ సేనాపతికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సేనాపతి.. అర గంట వ్యవధిలో పామును పట్టుకున్నారు. పామును చూసేందుకు సిబ్బందితోపాటు సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్నా కూడా వచ్చారు. పామును స్నేక్ స్నాచర్ సమీపంలో గల అడవుల్లో విడిచిపెట్టాడు.

నలుగురు నిందితుల అరెస్టు