
ఇద్దరు యువకులు అరెస్టు
కొరాపుట్: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఫొటోలు వైరల్ చేసిన ఘటనలో నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి డుమ్రిముండ గ్రామానికి చెందిన కల్పనా రాయ్ అనే నర్సింగ్ విద్యార్థిని విషంతాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ ఘటనలో ఆమె ఫొటోలు తీసిన ఉద్దవ్ బోడ నాయక్‌ని జయపూర్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జయపూర్‌లోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు బాధిత యువతికి దగ్గరి బంధువు కావడం విశేషం. అందుకే ఆమె వ్యక్తిగత ఫొటోలు తీయగలిగాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బొడనాయక్‌ని రాయిఘర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫొటోలు వైరల్ చేసిన సత్యజిత్ సర్కార్ తప్పించుకొని బస్సులో పారిపోయాడు. అయితే నయాగఢ్ జిల్లా దసపల్లా వద్ద రాయిఘర్ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఇతనిని కూడా రాయిఘర్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. సత్యజిత్ ఈనెల 13వ తేదీన జయపూర్‌లో బాధితురాలిపై దాడిచేసి ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. మరోవైపు బాధితురాలిని అధికారులు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. గురువారం వేకువజామున 4 గంటలకు ఆమెను ఐసీయూలో చేర్చారు. ఆమె ఎరువుల మందు తాగడం వలన పేగులు, కిడ్నీ, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు ప్రకటించారు.

ఇద్దరు యువకులు అరెస్టు