
టికెట్ల విక్రయంలో ఖుర్దారోడ్ టాప్
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వేలో ఖుర్దారోడ్ మండలం టికెట్ల విక్రయంలో అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. టికెట్లు కొనుగోలు కోసం ప్లాట్‌ఫారాల ప్రాంగణాల్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ల (ఏటీవీఎంలు) వాడకంలో ప్రయాణికులను గణనీయంగా ప్రోత్సహిస్తోంది. మండల వ్యాప్తంగా వివిధ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఏటీవీఎంలు, టచ్ స్క్రీన్ ఆధారిత కియోస్క్‌లు దూర ప్రాంతాల ప్రయాణికులకు చిటికెలో సాధారణ టికెట్లని అందజేస్తున్నాయి. వాటితో ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు, నెలవారీ మరియు త్రైమాసిక సీజన్ టిక్కెట్లను ఈ వ్యవస్థ అందజేస్తుంది. స్మార్ట్ కార్డులు, క్యూ ఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులతో సహా బహుళ చెల్లింపు విధానాలతో ప్రయాణికులకు ఇబ్బందిరహితంగా టికెట్లు విక్రయిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖుర్దారోడ్ మండలం ఏటీవీఎంల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణించే 41,28,866 మంది ప్రయాణికులకు 27,24,298 టిక్కెట్లను జారీ చేసి సమగ్రంగా రూ.30.69 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆదాయం ఈ ఏడాది మరింత పుంజుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) గత ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి ఏటీవీఎం 7,99,760 మంది ప్రయాణికులకు 5,40,447 టిక్కెట్లు జారీ చేయగా ఈ ఏడాది ప్రయాణికులకు 7,97,340 టికెట్లు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదాయం సగం పైబడి పుంజుకుంది. గతేడాది రూ.5.93 కోట్లకు పరిమితమైన ఆదాయం ఈ ఏడాది 65.5 శాతం పెరుగుదలతో రూ.9.82 కోట్లు ఆర్జించింది.
తొలి త్రైమాసికంలో గణనీయంగా పెరిగిన ఆదాయం

టికెట్ల విక్రయంలో ఖుర్దారోడ్ టాప్