ఖోయిర్‌పూట్ సమితి కార్యాలయం ముట్టడి
మల్కన్‌గిరి: మంచినీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు నినదించారు. దాహంతో అవస్థలు పడుతున్నామని అధికారులు స్పందించాలని వేడుకున్నారు. ఇదే డిమాండ్‌తో మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కార్యాలయాన్ని మూడు పంచాయతీలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం ముట్టడించారు. రాస్‌బేడ పంచాయతీ పరిధిలోని బాలిగూఢ, సిందిగూఢ, రాస్‌బెఢ గ్రామాల్లో తీవ్రమైన నీటిఎద్దడి నెలకుంది. వేసవి కాలం వచ్చిందంటే స్థానికంగా ఉన్న నీటి వనరులు అడుగంటిపోతుంటాయి. దీంతో బిందెడు నీటి కోసం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాశయానికి వెళ్లాల్సి వస్తుంది. సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్, బ్లాక్ చైర్మన్‌కు వినతులు అందించినప్పటికీ ప్రయోజనం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ సమ్యను తీర్చాలంటు భారీగా మహిళలు తరలివచ్చి ఖాళీ బిందెలతో సమితి కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేశారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని, శాశ్వత నీటి సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకూ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతిపత్రాలను అందజేశారు.
మంచినీటి సమస్య పరిష్కరించాలని
డిమాండ్
ఖాళీ బిందెలతో మహిళల నిరసన


