అంత్యోదయ గృహ యోజన పథకం ఆరంభం
మల్కన్‌గిరి: రాష్ట ప్రభుత్వం అమలు చేసిన అంత్యోదయ గృహ యోజన పథకాన్ని మల్కన్‌గిరి జిల్లా సమితి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ సోమవారం ప్రారంభించారు. తొలుత ఈ పథకానికి కలహండి జిల్లా భవానీపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆదివారం శ్రీకాకరం చుట్టారు. ఈ పథకం ద్వారా నిరుపేదలు, వితంతువులు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినవారు, తీవ్రమైన వ్యాధులతో బాపడేవారు, దివ్యాంగులకు గృహాలను మంజూరు చేస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,629 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. నాలుగు నెలల్లో గృహ నిర్మాణం పూర్తయితే రూ. 20 వేలు, ఆరు నెలలో పూర్తయితే రూ. పది వేలు ప్రోత్సాహకంగా అందజేస్తారు. 95 రోజులు ఉపాధి పనులు కల్పిస్తారు. అలాగే ఇళ్లకు విద్యుత్, తాగునీరు, గ్యాస్, టాయిలెట్ సదుపాయాలను కల్పిస్తారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఒకొక్కరికీ రూ. లక్షా 20 వేలు విలువైన చెక్కులను అందజేశారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, మల్కన్‌గిరి సమితి అధికారి తపన్ కుమార్ సేనాపతి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్‌చంద్ర శభర, స్వయం సహాయక సంఘ మహిళాలు, కార్మికులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఎచ్చెర్ల: లావేరు మండలం రావివలస సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పిన్నింటి రాము, మరో వ్యక్తి సుభద్రాపురం నుంచి విశాఖ వైపు కారులో వెళ్తుండగా హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికీ కాళ్లు విరగడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.


