పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో 20 పంచాయతీలను క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక చేసి జిల్లాలో 49 డిజిగ్నేటేడ్ మైక్రోస్కోప్ సెంటర్లు, 7 టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 1451 మందికి క్షయ పాజిటివ్‌గా గుర్తించారు. వారిలో 1117 మందికి చికిత్స పూర్తి చేశారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 507 మందిని గుర్తించి వారికి చికిత్స అందించారు.
700 మంది పౌష్టికాహారం కిట్లు
ప్రస్తుతం జిల్లాలో ఏడు వందల మంది పౌష్టికాహారం కిట్లు పొందుతున్నారని జిల్లా క్షయ నియంత్ర అధికారి డాక్టర్ ఎం.వినోద్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారిలో కనీసం 10 నుంచి 15 శాతం మందికి కఫం పరీక్షలు చేయాలని ఆదేశించామని చెప్పారు. ఏఎన్‌ఎం, అశ కార్యకర్తలు క్షయరోగులను పరామర్శించి, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడమే కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి ‘కఫం’ పరీక్షకు పంపించాలని సూచించినట్లు చెప్పారు.