శ్రీరామనవమి వేడుకలపై సమీక్షిస్తున్న ఆర్డీఓ సూర్యకళ
● ఆర్డీఓ సూర్యకళ
నెల్లిమర్ల రూరల్: ప్రభుత్వ లాంఛనాలతో ఈ నెల 30న జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ సూర్యకళ ఆదేశించారు. రాములోరి సన్నిధిలో అన్ని శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు సుమారు 25వేల మంది భక్తులు వచ్చే అవకాశముందన్నారు. కల్యాణం అనంతరం తలంబ్రాల పంపిణీలో తోపులాటలు జరగకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ రమణరాజు, ఈఓ ప్రసాదరావు, ఎస్సై నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
4 లక్షల టన్నుల చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో 4 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిందని కర్మాగారం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ.నాగశేషారెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరకు పంట నరికేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుతం వాతావరణం బాగుండడంతో అన్ని గ్రామాల్లో చెరకు నరికేందుకు రైతులు ముందుకొచ్చారని, ప్రతిరోజు సుమారు 4వేల టన్నుల చెరకు క్రషింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కర్మాగారానికి చెరకును తరలించిన వారంరోజులకే రైతుల ఖాతాలకు బిల్లులు జమచేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం ధ్యేయమని పేర్కొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని
నెల్లిమర్ల: పట్టణంలోని వేణుగోపాలపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎ.హారిక జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున తలపడనుంది. హారికను గురుకులాల జిల్లా సమన్వయాధికారి బి.చంద్రావతి, పాఠశాల ప్రిన్సిపాల్ కె. ఉషారాణి, పీడీ వీరమణి, పీఈటీ అప్పలనరసమ్మ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఇంటర్మీడియట్ పరీక్షకు 26,887మంది హాజరు
విజయనగరం పూల్‌బాగ్: విజయనగరం ఉమ్మడి జిల్లాలో సోమవారం ఇంటర్మీడియట్ ఫస్టియర్ గణితం, సివిక్స్, బోటనీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 26,887 మంది విద్యార్థులు హాజరుకాగా 1773 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 6,121 మందికి 5,368 మంది హాజరయ్యారు. ఆర్‌ఐఓ రెండు, డీఈసీ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. స్క్వాడ్ బృందాలు 45, మిగిలిన అఽధికారులు 8 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులను డీబార్ చేసినట్టు ఆర్‌ఐఓ ఎం.సత్యనారాయణ తెలిపారు.
సుజలస్రవంతికి భూసేకరణ
● ఇన్‌చార్జి ఆర్డీఓ పద్మలత
బొబ్బిలి: సులజ స్రవంతి ప్రాజెక్టుకు అవసరమైన ఐదువేలు ఎకరాల భూసేకరణ ప్రక్రియ జోరందుకుందని ఇన్‌చార్జి ఆర్డీఓ పి.పద్మలత తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తన యూనిట్ పరిధిలోని నాలుగు మండలాల్లో 2,700 ఎకరాలను సేకరిస్తున్నామన్నారు. ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పిల్ల కాలువల నిర్మాణానికి నాలుగు ఎకరాల మినహా మిగిలిన భూ సేకరణ పూర్తయిందన్నారు.
ధీర ఫౌండేషన్ ఆపన్న హస్తం
విజయనగరం: పట్టణానికి చెందిన ధీరా ఫౌండేషన్ అధ్యక్షడు బొత్స సందీప్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నగరంలోని లంకవీధి ప్రాంతానికి చెందిన రామిరెడ్డి వాసు గత కొంతకాలంగా అనారోగ్యంతో తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపరేషన్ కోసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. నిరుపేద అయిన వాసు వద్ద చికిత్సకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ధీర ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బొత్స సందీప్ వాసుకు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అదేవిధంగా వైద్య ఖర్చుల కోసం బాధితుడి భార్య రామిరెడ్డి శ్రీవల్లికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై న హారిక


