ట్రాక్టర్ల చోరీ నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ల చోరీ నిందితుల అరెస్ట్‌

Mar 21 2023 1:48 AM | Updated on Mar 21 2023 1:48 AM

కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్న  ఎస్పీ ఎం.దీపిక - Sakshi

కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్న ఎస్పీ ఎం.దీపిక

● ట్రాక్టర్‌ ఇంజిన్‌, మూడు ట్రక్కులు, రూ.4.50 లక్షల రికవరీ

విజయనగరం క్రైమ్‌: జిల్లాలో ట్రాక్టర్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఒక ట్రాక్టర్‌ ఇంజిన్‌, మూడు ట్రక్కులు, రూ.4.50 లక్షలు నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఎస్‌.కోట, ఎల్‌.కోట, జామి, డెంకాడ, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ట్రాక్టర్‌ దొంగతనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు కేసుల మిస్టరీని ఛేదించేందుకు ఇన్చార్జ్‌ డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు నేతృత్వంలో సీసీఎస్‌, జామి, ఎస్‌.కోట పోలీసులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు ఈ తరహా నేరాలకు పాల్పడిన నేరస్తులను రాష్ట్రవ్యాప్తంగా విచారణ చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాయి. జామి మండలం అలమండ రైల్వేస్టేషన్‌ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న శ్రీకాకుళపు నాగరాజు అనే వ్యక్తిని జామి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, తాను, కొత్తవలస మండలం వియ్యంపేటకు చెందిన నాగులాపల్లి గణేష్‌, మరో జువైనల్‌ సహకారంతో బృందంగా ఏర్పడి, ఊరికి చివరగా ఉన్న వ్యవసాయ కళ్లాల్లో ఉన్న పాత ట్రాక్టర్లను దొంగిలించి, వాటి రూపురేఖలు మార్పు చేసి, స్క్రాప్‌ షాపులకు విక్రయించేవారని తెలిసింది.

అప్పుల బారి నుంచి బయటపడేందుకు..

నిందితులు ఇటుక బట్టీల్లో పనిచేస్తూ, బట్టీ యజమానుల దగ్గర అడ్వాన్సుగా డబ్బులు తీసుకుని, తిరిగి చెల్లించకపోవడంతో అప్పులబారిన పడ్డారు. అప్పుల బారినుంచి బయట పడేందుకు గాను జామి మండలంలో ఒకటి, ఎస్‌.కోట మండలంలో రెండు, ఎల్‌.కోట మండలంలో ఒకటి, డెంకాడ మండలంలో ఒకటి, విజయనగరం మండలంలో మరొకటి వెరసి మొత్తం ఆరు ట్రాక్టర్లను దొంగిలించినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. ఈ కేసుల్లో గణేష్‌ను అరెస్టు చేసి, ఒక ట్రాక్టర్‌ ఇంజిన్‌, మూడు ట్రక్కులు, ట్రాక్టర్లను స్క్రాప్‌ షాపులకు విక్రయించిన నగదులో రూ.4.050 లక్షలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరాల్లో రూరల్‌ పీఎస్‌కి చెందిన మరో ట్రాక్టర్‌ను కడపకు చెందిన బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి నుంచి రికవరీ చేయాల్సి ఉంది. ఆరు కేసుల్లో ఎటువంటి ఆధారాలు లభించనప్పటికీ జామి ఎస్సై జి.వీరబాబు, సీసీఎస్‌ ఎస్సై బి.సాగర్‌బాబు, ఎస్‌.కోట ఎస్సై జె.తారకేశ్వరరావు, సీసీఎస్‌ ఏఎస్సై ఎ.గౌరీశంకరరావు, హెచ్‌సీలు దాసరి శంకరరావు, మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, జి.మహేశ్వరరావు, ఎస్‌.ఈశ్వరరావు, కానిస్టేబుళ్లు ఎం.చిరంజీవిరాజు, ఎస్‌.రమణ, ఎన్‌.గౌరీశంకర్‌, హోంగార్డు జె.నారాయణరావులు ఎంతో శ్రమించి కేసుల మిస్టరీని ఛేదించారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ జి.రాంబాబు, ఎస్సైలు జి.వీరబాబు, బి.సాగరబాబు, ప్రశాంతకుమార్‌, నసీమా బేగం, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రికవరీ చేసిన ట్రాక్టర్‌లను పరిశీలిస్తున్న ఎస్పీ1
1/1

రికవరీ చేసిన ట్రాక్టర్‌లను పరిశీలిస్తున్న ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement