పల్లె పోరుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరుకు సిద్ధం

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

పల్లె పోరుకు సిద్ధం

నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికలు నందిగామ డివిజన్‌లో రెండో దశ ఎన్నికలు మొత్తం 127 సర్పంచ్‌, 1,203 వార్డు స్థానాలకు పోలింగ్‌ ఎన్నికల నిర్వహణకు 4వేల మంది అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల్లో కలెక్టర్‌ లక్ష్మీశ పరిశీలన

కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లపై జేసీ అసహనం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీ ఆదివారం నందిగామ డివిజన్‌లోని పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండోదశ ఎన్నికల్లో 127 సర్పంచ్‌ స్థానాలు, 1,203 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు 4 వేల మంది అధికారులు, సిబ్బందిని నియమించారు.

నందిగామ డివిజన్‌లో..

నందిగామ డివిజన్‌ పరిధిలో కంచికచర్ల మండలంలో 16 పంచాయతీలు, 178 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నందిగామ మండలంలో 23 పంచాయతీలు, 228 వార్డులకు, చందర్లపాడు మండలంలో 18 పంచాయతీలు, 194 వార్డులు, వీరులపాడు మండలంలో 22 పంచాయతీలు, 212 వార్డులకు, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలో 15 పంచాయతీలు, 162 వార్డులు, వత్సవాయి మండలంలో 25 గ్రామ పంచాయతీలు, 246 వార్డులు, జగ్గయ్యపేట మండలంలో 19 పంచాయతీలు, 212 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం 1,468 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు.

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు పరిశీలన

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ కంచికచర్ల మార్కెట్‌ యార్డు, నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెయ్యిమందికిపైగా పోలీసులతో పటిష్ట భద్రతా చర్యలు ఉంటాయని, పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూస్తున్నామని, సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు వెబ్‌ క్యాస్టింగ్‌కు కూడా ఏర్పాట్లు చేశామన్నారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు

పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో నిరంతర నిఘా, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్‌కు ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎన్నికలకు సంబంధించి సమాచారం లేదా ఫిర్యాదులకు కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం (91549 70454) అందుబాటులో ఉందని, ఈ నంబరులో సంప్రదించవచ్చని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట డీపీవో టి.సీతామహాలక్ష్మి, నందిగామ ఆర్‌డీఓ జి.అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆకలితో ఆలమటించిన ఎన్నికల సిబ్బంది!

కంచికచర్ల: ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాల్సిన ఎన్నికల సిబ్బందికే కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బందికి కనీసం భోజనం, తాగునీరు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎదురైంది. ఆదివారం జరగనున్న పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్‌ సిబ్బంది శనివారం కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. వారికి అధికారులు భోజన ఏర్పాట్లు చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాగునీటికి ఇక్కట్లే

మరోవైపు సరైన తాగునీటి సరఫరా కూడా లేకపోవడంతో సిబ్బంది అవస్థ పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా భోజనం అందక పలువురు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టే పోలింగ్‌ సిబ్బందికి కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై లేదా.. విధుల కోసం సుదూర ప్రాంతాల నుంచి ముందుగానే కేంద్రానికి చేరుకున్న సిబ్బందికి భోజనం, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు ఎందుకు అందుబాటులో ఉంచలేదనే ప్రశ్న ఎదురవుతోంది. ఎన్నికలు సజావుగా నిర్వహించా లంటే పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం. విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సిబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల ముందస్తు ప్రణాళిక ఎక్కడ అన్న ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

వీరులపాడు: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ ఇలక్కియ అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా కౌంటింగ్‌ కేంద్రం ఇరుకు గదిలో ఏర్పాటు చేయటం, రెండు గదులు ఏర్పాటు చేయకూడదని అధికారులకు పలు సూచనలు అందజేశారు. అనంతరం వీరులపాడు మండలం, జుజ్జూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ పి.అనిల్‌ కుమార్‌, తహసీల్దార్‌ పాలపర్తి రవికుమార్‌, ఎంపీడీవో రూపవతి పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement